హడావుడిగా శంఖారావం ప్రకటించిన టీడీపీ, జనసేన.. సిద్ధం సభలతో కంగారుపడుతున్నారా?
నిన్నటి వరకు బహిరంగ సభ ఊసే లేదు. అసలు అలాంటి చర్చగానీ, దాని గురించి చంద్రబాబు, పవన్ మాటల్లో గానీ ఎక్కడా రాలేదు.
వైసీపీ ఓటమే లక్ష్యంగా పొత్తు కలిశామని ప్రకటిస్తున్న టీడీపీ, జనసేనలు ఎట్టకేలకు ఉమ్మడిగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. ఈ నెల 28న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాయి. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి రెండు పార్టీలు కలిసి శ్రీకారం చుడతాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
సిద్ధం సభలతో కంగారుపడుతున్నారా..?
ముఖ్యమంత్రి జగన్ సిద్ధం అంటూ దూసుకుపోతున్నారు. సిద్ధం పేరుతో మూడు, నాలుగు జిల్లాలకు కలిపి ఒకచోట ఇప్పటికే మూడు సభలు నిర్వహించారు. దానికి పోటెత్తుతున్న జనసంద్రాన్ని చూసి ప్రతిపక్షాల్లో కంగారు మొదలైంది. శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంటుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ అర్థమైంది. అందుకే హడావుడిగా శంఖారావం పూరించబోతున్నారు.
సమన్వయ కమిటీలు నిర్ణయించేశాయట!
నిన్నటి వరకు బహిరంగ సభ ఊసే లేదు. అసలు అలాంటి చర్చగానీ, దాని గురించి చంద్రబాబు, పవన్ మాటల్లో గానీ ఎక్కడా రాలేదు. ఇంతలోనే హడావుడిగా ఇరు పార్టీలు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ సభకు వేదిక, తేదీ కూడా ఫిక్స్ చేసేయడం గమనార్హం. సమన్వయ సమావేశంలో చర్చించి, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు ప్రెస్‌మీట్‌లో చెప్పారు. సిద్ధం సభలకు జనప్రవాహాన్ని చూసి షాకవుతున్న టీడీపీ, జనసేన అధినేతలు తాము కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లకపోతే దెబ్బతింటామన్న ఉద్దేశంతోనే ఈ సభ ఏర్పాటుకు హడావుడి పడుతున్నారు.