మన దగ్గర బేరాల్లేవమ్మా..! ఇకనైనా గట్టిగా చెప్పగలరా..?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పొత్తులపై ఓ అడుగు ముందుకు పడేలా చేసినా, జనసేనకు డిమాండ్ చేసే అవకాశాన్ని మాత్రం తగ్గించాయనే చెప్పాలి.
ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడుచోట్ల గెలిచి వైసీపీకి షాకిచ్చింది. అది విజయమే కాదు, వారు ఓటర్లే కాదు అని అధికార పార్టీ కవర్ చేసుకోవాలనుకున్నా కూడా ప్రతిపక్షం సంబరాలు చేసుకుంటోంది. అయితే టీడీపీకి అధికారికంగానే మద్దతు తెలిపిన జనసేన నుంచి కనీసం శుభాకాంక్షల మెసేజ్ కూడా బయటకు రాలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేశాను, అందుకే ఈ విజయం అనే ఆత్మస్తుతి కూడా లేదు. పవన్ కల్యాణ్ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అటు చంద్రబాబుకి కూడా ఈ విజయం తర్వాత 2024 ఎన్నికల పోరాటంపై కాస్తో కూస్తో ధీమా పెరిగిందనే చెప్పాలి.
జనసేనకు 20 ఇస్తానన్నారు, 30 ఇస్తానన్నారు అంటూ వాట్సప్ లో వచ్చే మెసేజ్ లు నమ్మొద్దని, టీడీపీతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని ఇటీవల ఆవిర్భావ సభలో చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. అంటే పొత్తుల లెక్కలు ఇంకా తేలలేదని ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. సీట్ల దగ్గరే తకరారు మొదలైంది. టీడీపీ మరీ తీసికట్టుగా సీట్లు ఇస్తామని చెబుతోంది, జనసేన మాత్రం తమ బలం పెరిగింది వాటా పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈ పరిస్థితిని మార్చేస్తాయనే ఊహాగానాలు వినపడుతున్నాయి.
బేరాల్లేవమ్మా.. !
పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు బేరాలాడారనే అనుకుందాం. ఆయనకు సర్దిచెప్పాలనే ఉద్దేశంతోటే చంద్రబాబు ఉండి ఉంటారు. జనసేనతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లడం కష్టమనే ఇప్పటి వరకూ ఆయన భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం బాబు దగ్గర బేరాలుండవని తెలుస్తోంది. ఈ మూడు విజయాలను సాకుగా చూపి పవన్ కల్యాణ్ ని కన్విన్స్ చేయగలరు. ఆయన అడిగిన సీట్లు కాకుండా, తాను ఇచ్చిన సీట్లతోనే సరిపెట్టుకోవాలని చెప్పే అవకాశముంది. ఒకరకంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పొత్తులపై ఓ అడుగు ముందుకు పడేలా చేసినా, జనసేనకు డిమాండ్ చేసే అవకాశాన్ని మాత్రం తగ్గించాయనే చెప్పాలి.
పవన్ కు ప్రత్యామ్నాయం లేదా..?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ బలమేంటి, బీజేపీ బలమేంటి అనేది పవన్ కు క్లియర్ గా అర్థమై ఉంటుంది. అటు బీజేపీ నుంచి కూడా కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మూడు పార్టీలతో కూటమి ఏర్పడాలని కోరుకుంటున్నారు. ఈ దశలో ముందుగానే టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కీలక స్థానాలపై హామీ పొందాలనే ఆతృత పవన్ లో కూడా కనిపిస్తున్నట్టు ఉంది. ఎన్నికలకింకా ఏడాది మాత్రమే టైమ్ ఉంది. పొత్తు వ్యవహారాలు తేల్చితేనే ఆశావహులకు ఓ క్లారిటీ వస్తుంది. ఎన్నికల వరకూ జనసేన జెండా మోసి, ఆ తర్వాత సైకిల్ గుర్తుకి ఓటేయండి అని ప్రచారం చేయాలంటే జనసైనికులకు కూడా కాస్త కష్టంగానే ఉంటుంది.