పాపం.. డీఎల్ పరిస్థితి ఇలాగైపోయిందా..?
ఇంతకాలం జగన్ తనను పిలిచి ఏదో పదవి ఇస్తారని అనుకున్నట్లున్నారు. ఇక అదేమి జరగదని నిర్ధారణ చేసుకున్నట్లున్నారు. అందుకనే ఏదేదో మాట్లాడేశారు.
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి వ్రతం చెడ్డా ఫలితమైతే దక్కేట్లు లేదు. విషయం ఏమిటంటే.. మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి మీద నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. చేయాల్సిన ఆరోపణలు, విమర్శలన్నీ చేసేశారు. వైసీపీలో ఉన్నందుకు తాను సిగ్గుపడుతున్నట్లు కూడా చెప్పేశారు. నిజానికి డీఎల్ వైసీపీలోనే ఉన్నారని చాలామందికి ఆయన చెప్పేంతవరకు తెలీదు. ఇంతకీ ఇంతకాలం కామ్ గా ఉండి ఇప్పుడే ఎందుకు జగన్ పై విరుచుకుపడ్డారు..?
ఎందుకంటే.. ఇంతకాలం జగన్ తనను పిలిచి ఏదో పదవి ఇస్తారని అనుకున్నట్లున్నారు. ఇక అదేమి జరగదని నిర్ధారణ చేసుకున్నట్లున్నారు. అందుకనే ఏదేదో మాట్లాడేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ పైన వైసీపీలో ఎవరో చిన్నస్థాయి వ్యక్తి తన అసంతృప్తిని వెళ్ళగక్కినా తమ్ముళ్ళు, ఎల్లోమీడియా దాన్ని అందుకుని విపరీతమైన హైప్ ఇచ్చేస్తారు. పదేపదే ప్రెస్ మీట్లు పెట్టి జగన్ పై విరుచుకుపడిపోతారు.
అలాంటిది డీఎల్ లాంటి పెద్ద నాయకుడు జగన్ పై అన్ని మాటలన్నా టీడీపీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. తమ్ముళ్ళ సంగతి ఇలాగుంటే మంత్రులు లేదా వైసీపీ నేతలు కూడా పట్టించుకున్నట్లు లేరు. చివరకు జిల్లాలో కూడా ఎవరూ పరిగణలోకి తీసుకోలేదు. డీఎల్ టీడీపీలో చేరబోతున్నట్లు చాలాకాలంగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆయన పోటీచేయటానికి మైదుకూరులో ఖాళీలేదు. మాజీ ఎంఎల్ఏ సుధాకర్ యాదవ్ గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టి యాదవ్ ను కాదని టికెట్ వచ్చే అవకాశాలు లేవు.
ఈ విషయం తెలుసు కాబట్టే టీడీపీలో డీఎల్ ను ఎవరూ పట్టించుకోలేదేమో.. పోనీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పొగిడారు కాబట్టి వాళ్ళన్నా పట్టించుకున్నారా అంటే అదీలేదు. పవన్ నిజాయితీ పరుడు అనటాన్ని స్వాగతిస్తునే పరిపాలనా అనుభవం లేదన్నందుకు ఎగెరిగెరి పడుతున్నారు. అంటే ఇటు వైసీపీ నేతలూ పట్టించుకోక, అటు టీడీపీ నేతలూ గుర్తించక, జనసేన నేతలు మండిపోతున్నది చూసిన తర్వాత డీఎల్ పరిస్ధితి ఇలాగైపోయిందే అనిపిస్తోంది.