టీడీపీ-జనసేన సమావేశాలు సరే.. సమన్వయం కుదిరేనా..?
పొత్తుకు రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వం సుముఖంగానే ఉందని, కిందిస్థాయిలోనే కొన్ని ఇబ్బందులున్నాయని పవన్ మొన్న రాష్ట్ర సమన్వయ కమిటీ మీటింగ్‌లో చెప్పేశారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమని ప్రకటించిన టీడీపీ, జనసేన దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రస్థాయి నేతలతో ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కలిసి మీటింగ్ పెట్టారు. రెండు పార్టీల మధ్య సమన్వయానికి ఏం చేయాలనేదానిపై చర్చించారు. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి మూడు రోజులపాటు జిల్లాలవారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు.
రెండు పార్టీల నుంచి ఇద్దరు పరిశీలకులు
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జిల్లాస్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి రెండు పార్టీల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, నాయకులను ఆహ్వానించారు. టీడీపీ, జనసేన మధ్య సమన్వయానికి ఏమైనా ఇబ్బందులుంటే చర్చిస్తారు. ప్రతి జిల్లాకు ఒక టీడీపీ నేత, జనసేన నుంచి ఒక నాయకుడు పరిశీలకులుగా వెళతారు. అక్కడ నాయకులు ప్రస్తావించిన సమస్యలను వీరు రాష్ట్ర సమన్వయ కమిటీకి నివేదిస్తారు.
క్షేత్రస్థాయిలో సమన్వయం ఎంత వరకు సాధ్యం?
పొత్తుకు రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వం సుముఖంగానే ఉందని, కిందిస్థాయిలోనే కొన్ని ఇబ్బందులున్నాయని పవన్ మొన్న రాష్ట్ర సమన్వయ కమిటీ మీటింగ్‌లో చెప్పేశారు. ప్రస్తుతానికి టీడీపీ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఆ పార్టీ నాయకులు జనసేనతో పొత్తులో ఉన్నాం జాగ్రత్త అంటే టీడీపీ కార్యకర్తలు కాస్త కంట్రోల్‌లోనే ఉంటారు. కానీ ఓ పార్టీగా పూర్తిస్థాయి నిర్మాణం లేని జనసేనలో కార్యకర్తలకు ఎలా సముదాయించి చెప్తారనేది ఆసక్తికరం. దూకుడుగా ఉండే పవన్ అభిమానులు, జనసైనికులను పసుపుదళంతో కలిపి వైసీపీ మీదకు దండయాత్రకు తీసుకెళ్లడం రెండు పార్టీల నేతలకూ కత్తిమీద సామే మరి!