మరో ప్రచార కార్యక్రమానికి సిద్ధమైన టీడీపీ
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చంద్రబాబు వివరించారు. వ్యూహరచన భేటీలో చర్చించిన అంశాలపై టీడీపీ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.
''బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ'' కార్యక్రమాల తరహాలో మరో ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టబోతోంది. జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా లబ్దిదారులకు పథకాలు అందిస్తున్న నేపథ్యంలో వాటిపై ప్రజల్లో ఆలోచన కలిగించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. జగన్ ఇస్తున్నది ఎంత?.. తిరిగి తీసుకుంటున్నది ఎంత? అన్న దానిపై ప్రజలకు గణాంకాలు వివరించాలని టీడీపీ నిర్ణయించింది.
చంద్రబాబు అధ్యక్షత జరిగిన టీడీపీ వ్యూహరచన కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పథకాల పేరుతో లబ్దిదారులకు ఇస్తున్న దాని కంటే జగన్ ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మే అధికంగా ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఒక్కో వర్గానికి సంబంధించి జగన్ ఇస్తున్నది ఎంత?.. తిరిగి తీసుకుంటున్నది ఎంత..? అన్న దానిపై కరపత్రాలను విడివిడిగా ముద్రించాలని నిర్ణయించారు.
''నేను ఆటో డ్రైవర్లతో మాట్లాడా. జగన్ వారికి ఏడాదికి రూ.10వేలు ఇస్తున్నారు. గతంతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. రోడ్లు దారుణంగా ఉన్నాయి. దాంతో ఆటోలు పదేపదే రిపేర్‌కు వస్తున్నాయి. వాహనాలపై విధించే పన్నులను భారీగా పెంచారు. నిత్యావసరధరలు భారీగా పెరిగాయి, ఇవన్నీ కలిపితే ఒక్కో ఆటో నుంచి ఏడాదికి 90వేల వరకు ప్రభుత్వం రాబడుతోంది. ఇచ్చేది మాత్రం రూ.10వేలే. ఈ విషయాలన్నీ ఆటో డ్రైవర్లే నాతో చెప్పారు'' అంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమావేశంలో వివరించారు.
జగన్ పాలనలో మద్యం, ఇసుక, మైనింగ్‌లో భారీగా దోపిడీ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలకు ఇవ్వాలంటే డబ్బులు లేవంటున్నారని.. కానీ వైసీపీ నేతల ఆస్తులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయని.. వారంతా కరెన్సీ కట్టల్లో మునిగితేలుతున్నారని విమర్శించారు. వీటిని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చంద్రబాబు వివరించారు. వ్యూహరచన భేటీలో చర్చించిన అంశాలపై టీడీపీ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండాపోయిందని, జగన్‌కు వివేకానందరెడ్డి హత్య కేసు వెంటాడుతోందని, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని.. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తప్ప జగన్‌కు మరో దారి లేదని ఆ ప్రకటనలో టీడీపీ వివరించింది. తాము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని.. ఈసారి టీడీపీకి 160 సీట్లు వస్తాయని ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు.
వైసీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని.. 75 మంది ఎమ్మెల్యేలు జగన్‌పై అసంతృప్తితో ఉన్నారని టీడీపీ చెప్పింది. జగన్ గ్రాఫ్ పడిపోతున్న అంశాన్ని జాతీయ సర్వేసంస్థలు కూడా చెబుతున్నాయని.. ఇటీవల ఒక సర్వేలో జగన్ గతేడాదితో పోలిస్తే నాలుగో స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయారని టీడీపీ ప్రకటనలో వివరించింది.