Telugu Global
Andhra Pradesh

మహానాడులో విందు పసందు.. నోరూరిస్తున్న వంటకాల జాబితా!

విజయవాడలోని అంబికా క్యాటరింగ్‌ అండ్‌ ఈవెంట్స్‌కు చెందిన కిలారు వెంకట శివాజీ‌కి వంట బాధ్యతల్ని టీడీపీ అప్పగించింది. అతని పర్యవేక్షణలో దాదాపు 1500 మంది వంటవాళ్లు సుమారు 200 వంటకాల్ని అతిథుల కోసం సిద్ధం చేయబోతున్నారు

మహానాడులో విందు పసందు.. నోరూరిస్తున్న వంటకాల జాబితా!
X

మహానాడుకి విచ్చేయబోతున్న అతిథులకి నోరూరించే వంటకాల్ని టీడీపీ సిద్ధం చేస్తోంది. రాజమహేంద్రవరంలోని వేమగిరి శనివారం, ఆదివారం ఈ మహానాడుకి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఏపీలో ఎన్నికలకి ముందు జరగబోయే మహానాడు కావడంతో పెద్ద ఎత్తున జనసమీకరణ బాధ్యతని ఉత్తరాంధ్ర నాయకులు భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 15 లక్షల మంది వరకు ఈ మహానాడుకి రాబోతున్నట్లు టీడీపీ చెప్తోంది. అంతేకాదు ఈ మేరకు వంటకాల్ని కూడా సిద్ధం చేయిస్తోంది.

విజయవాడలోని అంబికా క్యాటరింగ్‌ అండ్‌ ఈవెంట్స్‌కు చెందిన కిలారు వెంకట శివాజీ‌కి వంట బాధ్యతల్ని టీడీపీ అప్పగించింది. అతని పర్యవేక్షణలో దాదాపు 1500 మంది వంటవాళ్లు సుమారు 200 వంటకాల్ని అతిథుల కోసం సిద్ధం చేయబోతున్నారు. అలానే కేవలం వడ్డించడానికే 800 మందిని అంబికా క్యాటరింగ్‌ అండ్‌ ఈవెంట్స్‌ వారు సమకూర్చారు. ఒక్కో వంటకానికి 50 మంది చొప్పున కేటాయించినట్లు తెలుస్తోంది.

శనివారం ప్రతినిధుల సభ జరగబోతుండగా ఈరోజు టిఫిన్ కింద ఇడ్లీ, వడ, మైసూర్ భజ్జీతో పాటు పునుగులు, పొంగల్, టమాటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ రెడీ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో వెజ్ బిర్యానీ, బంగాళదుంప కుర్మా, మామిడికాయ పప్పు, గోంగూర, గుత్తు వంకాయ, మిక్స్డ్‌ వెజిటబుల్‌ కర్రీ, సాంబారు, పెరుగు అలానే మజ్జిగ పులుసుని కూడా వడ్డించబోతున్నారు. అదనంగా కాకినాడ కాజా, యాపిల్ హల్వా, తాపేశ్వరం గొట్టం కాజా కూడా అతిథులకి వ‌డ్డించ‌నున్నారు.

ఆదివారం కూడా శనివారం తరహాలోనే టిఫిన్ మెనూ ఉంటుంది. అలానే మధ్యాహ్నం, రాత్రి భోజనం కింద సాంబార్ రైస్, పెరగన్నం, చక్ర పొంగలిని అతిథులకి ఇవ్వనున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో 10 లక్షలకిపైగా వాటర్ బాటిళ్లు అలానే 10 లక్షలకిపైగా వాటర్ ప్యాకెట్లని కూడా తెప్పించి వేదిక వద్ద ఉంచారు.

వేమగిరి పరిసరాల్లో ఇప్పటికే 200 ఎకరాల విస్తీర్ణంలో టీడీపీ అన్ని ఏర్పాట్లు చేసింది. వాహనాల పార్కింగ్ పెద్ద ఎత్తున స్థలాన్ని కేటాయించింది. టిఫిన్, భోజనాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. బహిరంగ సభ జరిగే వేదికపై సుమారు 400 మంది అతిథులు కూర్చోబోతున్నారు. అలానే రెండు రోజుల పాటు మహానాడుకి వచ్చే వారి బస కోసం వేమగిరి నుంచి సుమారు 100 కి.మీ. పరిధిలోని కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జిలు, ఫంక్షన్‌ హాళ్లని అద్దెకి తీసుకుని ఏర్పాట్లు చేశారు.

First Published:  27 May 2023 9:04 AM IST
Next Story