Telugu Global
Andhra Pradesh

టీడీపీలో ఆళ్లగడ్డ టెన్షన్.. బాబు సభలో రభస తప్పదా..?

ముందు జాగ్రత్తగా ఏవీ సుబ్బారెడ్డి వర్గాన్ని సభకు దూరంగా ఉంచబోతున్నారు. అయితే ఇది అఖిలప్రియ కండిషన్ గా తెలుస్తోంది. కానీ సభలో ఏవీ వర్గం రచ్చ చేసే అవకాశం లేకపోలేదు.

టీడీపీలో ఆళ్లగడ్డ టెన్షన్.. బాబు సభలో రభస తప్పదా..?
X

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఈరోజు చంద్రబాబు బహిరంగ సభ జరగాల్సి ఉంది. ఈ సభలతో పార్టీనేతల్లో ఉత్సాహం తేవాలని, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని చూస్తున్నారాయన. అయితే ఆళ్లగడ్డ సభతో మొదటికే మోసం వచ్చేలా ఉంది. సభలో అసమ్మతి వర్గాల కుమ్ములాట బయటపడేందుకు అవకాశాలున్నాయి. దీన్ని నివారించేందుకు ముందుగానే ప్రయత్నాలు జరిగినా.. చివరకు సభలో గొడవలు జరిగితే అప్పుడెలా అని మధనపడుతున్నాయి టీడీపీ వర్గాలు.

గొడవలెందుకు..?

ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వైరం తెలిసిందే. ఇద్దరూ ఒకేపార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. నారా లోకేష్ యువగళం యాత్ర సందర్భంలో కూడా బలప్రదర్శనలు, బాహాబాహీలు.. అన్నీ జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు సభ సందర్భంగా మరోసారి అదే సీన్ రిపీటయ్యే అవకాశం కనపడుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఏవీ సుబ్బారెడ్డి వర్గాన్ని సభకు దూరంగా ఉంచబోతోంది అధిష్టానం. అయితే ఇది అఖిలప్రియ కండిషన్ గా చెబుతున్నారు. ఆమె ఒత్తిడి వల్లే సుబ్బారెడ్డిని టీడీపీ పెద్దలు బుజ్జగించి సభకు దూరం పెట్టారంటున్నారు. కానీ సభలో ఏవీ వర్గం రచ్చ చేసే అవకాశం లేకపోలేదు.

జనసేనతో గొడవ..

స్థానిక జనసేన నేతలతో కూడా అఖిలప్రియకు గొడవలున్నాయని అంటున్నారు. సహజంగా టీడీపీ సభా ఖర్చులు నిర్వహించే స్థానిక ఇన్ చార్జ్ లు, అభ్యర్థులు.. జనసేన నేతలను కూడా ఆహ్వానిస్తున్నారు. వారి ఖర్చులు కూడా భరించి సభలకు తరలిస్తున్నారు. కానీ ఆళ్లగడ్డ సభకు మాత్రం అఖిలప్రియ, జనసేనకు సహాయ నిరాకరణ చేశారట. వారి ఖర్చులు భరించలేనని తేల్చి చెప్పారట. వారు సభకు రాకపోయినా పర్లేదు అన్నారట. దీంతో స్థానిక జనసేన నేతలు బాయ్ కాట్ బాబు అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. చంద్రబాబు సభకు జనసేన తరపున అధికారికంగా ఎవరూ వెళ్లొద్దని ప్రచారం చేస్తున్నారు. అత్యుత్సాహంతో ఎవరైనా బాబుతో వేదిక పంచుకోవాలని తొందరపడితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అవి జనసేనలో అంతర్గత విభేదాలకు దారి తీసేందుకు అవకాశముంది.

First Published:  9 Jan 2024 7:33 AM IST
Next Story