టీడీపీ సర్కారు పాపం.. వైసీపీ ప్రభుత్వానికి శాపం
పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులకు విధించిన జరిమానా రూ.4.38 కోట్లు చెల్లించాలని గతేడాది అక్టోబరులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకి విధించిన రూ.242 కోట్ల జరిమానాపై విచారణ చేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.
తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా చేసిన పాపాలు వైసీపీ సర్కారుకి శాపాలుగా చుట్టుకున్నాయి. రాష్ట్ర విభజన తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్‌కి 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి గెలిచింది. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రవిభజన సందర్భంగా ఏపీకి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వరం ఇచ్చారు. దీని ప్రకారం కేంద్రమే ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంది. రాష్ట్రం చేతిలోకి పోలవరం నిర్మాణాన్ని తీసుకుని, దాన్ని ముందుకు సాగనివ్వకుండా పట్టిసీమ ఎత్తిపోతల, పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మించారు. పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలతో పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ ఎన్‌జిటిని ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించింది. పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానం ఏమీ కాదని వ్యాఖ్యానించింది. ఆదేశాలు అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పర్యావరణ ఉల్లంఘనలను ధ్రువీకరిస్తూ రూ.24 కోట్లు జరిమానా విధించాలని గతంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, జరిగిన ఉల్లంఘనల పాపం, వైసీపీ సర్కారుకి ఇప్పుడు చుట్టుకుంది.
పర్యావరణ ఉల్లంఘనలు విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పురుషోత్తపట్నం, పట్టిసీమపై ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది. పర్యావరణ ఉల్లంఘనలపై గతేడాది ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని, జరిమానా చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కింది. జరిమానా చెల్లించడం అనేది దానం చేయడం కాదన్న సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆదేశాలు అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.
ఈ ప్రాజెక్టులలో పర్యావరణ ముప్పుపై నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీని ఎన్‌జీటీ ఇదివరకే నియమించగా పురుషోత్తపట్నం ఎత్తిపోతలకి 2.48 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకి 1.9 కోట్లు జరిమానా వేయాలని నివేదిక ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా రూ.242 కోట్లు ఎన్‌జీటీ జరిమానా విధించింది. ఎన్‌జీటీ తీర్పుపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఎన్‌జీటీ ఇచ్చిన జరిమానా తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు, పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని ధ్రువీకరించింది. జరిమానా విషయంలో నిపుణుల కమిటీ సిఫారసు అమలు చేయాలని ఆదేశం జారీ చేసింది.
పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులకు విధించిన జరిమానా రూ.4.38 కోట్లు చెల్లించాలని గతేడాది అక్టోబరులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకి విధించిన రూ.242 కోట్ల జరిమానాపై విచారణ చేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. జరిమానా చెల్లింపుపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది కోర్టు. జరిమానా చెల్లించకుంటే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణ 3 వారాలకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.