వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ.. - కేడర్ కూడా ఆయన బాటలోనే..
జయమంగళ వెంకటరమణతో పాటు తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు కూడా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన జయమంగళకు సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కైకలూరు మాజీ ఎమ్మెల్యే అయిన జయమంగళ వెంకటరమణ.. టీడీపీ విధానాలు నచ్చక బుధవారం నాడు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ కైకలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేశారు.
కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో కలసి జయమంగళ సీఎంను కలిసి వైసీపీలో చేరారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జయమంగళ వెంకటరమణతో పాటు తెలుగుదేశం పార్టీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు కూడా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అలాగే ఆయన కేడర్ కూడా ఆయన బాటలోనే వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా జయమంగళ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మాట విని తన పదవిని కామినేని శ్రీనివాస్‌కు త్యాగం చేశానని చెప్పారు. అధికారంలోకి రాగానే తొలి ఎమ్మెల్సీ తనకే ఇస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొల్లేరు కాంటూరు కుదింపుపై అసెంబ్లీలో తీర్మానం చేశారని చెప్పారు. నేడు సీఎం వైఎస్ జగన్ కొల్లేరు రీసర్వే, రెగ్యులేటర్ల నిర్మాణం, పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం చేపడుతున్నారన్నారు. కొల్లేరు లంక గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి వైసీపీ నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతానని జయమంగళ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.