టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల భయం.. గెలవడం చాలా ముఖ్యమంటున్న నేతలు
టీడీపీ తరపున ఇంకా క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు జరగడం లేదు.
ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు వీటిని సెమీఫైనల్‌గా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29 తర్వాత ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతున్నది. అర్హులైన వాళ్లు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను డిసెంబర్ 30 వరకు స్వీకరించనున్నది. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు వస్తున్న ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను అధికార వైసీపీ చాన్నాళ్ల క్రితమే అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల ఇంచార్జులను కూడా నియమించి పకడ్బంధీగా వెళ్తోంది. ఇప్పటి వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చిన వైసీపీ.. ఈ సారి మాత్రం అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తోంది. అందుకే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి.. ఓటర్ల నమోదు విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-కర్నూలు-అనంతపురం నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతాయి. కానీ వైసీపీ బలపరిచిన అభ్యర్థుల కోసం పార్టీ కట్టుదిట్టమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష టీడీపీ కూడా ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నది. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోయినా.. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు తమ పార్టీకి అండగా ఉంటారని భావిస్తున్నది. అధికార వైసీపీపై అర్బన్ ఓటర్లలో వ్యతిరేకత ఉందని, అది తమకు కలసి వస్తుందని అంచనా వేస్తోంది. పట్టభద్రులు తప్పకుండా టీడీపీకే ఓటేస్తారని, ఇక ఉపాధ్యాయుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని.. ఇది టీడీపీని గెలిపిస్తుందని చంద్రబాబు పార్టీ సమీక్షల్లో చెబుతున్నారు.
కాగా, టీడీపీ తరపున ఇంకా క్షేత్ర స్థాయిలో మాత్రం ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు జరగడం లేదు. ఎంత సేపు జూమ్ మీటింగ్స్‌లో నాయకులను ఉరుకులు పరుగులు పెట్టించడమే తప్ప.. పార్టీ పరంగా చేయాల్సిన కసరత్తును మాత్రం చంద్రబాబు విస్మరించారని నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ లిస్టుపై కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉందని పార్టీ సీనియర్లు అంటున్నారు. అధికార వైసీపీ ఎప్పటికప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతూ.. ఎన్నికల విషయంలో ఒకడుగు ముందే ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ శ్రేణులు డీలా పలే అవకాశం ఉందని, అది రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని పార్టీ నేతలు భయపడుతున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ ధాటిని తట్టుకోవలంటే వెంటనే అభ్యర్థులు ప్రకటించాలని చంద్రబాబును కోరుతున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. ముందుగా ఓటర్ల ముసాయిదా జాబితాలోని నకిలీ ఓటర్లను గుర్తించాలని, దానిపై పోరాటం చేయమని పిలుపు ఇచ్చినట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కార్యచరణ అందిస్తానని నాయకులకు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తున్నది.