టీడీపీ కల నెరవేరలేదు..
పిన్నెల్లిపై జూన్-5 వరకు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు సూచించింది హైకోర్టు. దీంతో టీడీపీ శిబిరం నిరాశపడింది.
ఏపీ ఎన్నికల్లో జరిగిన గొడవల్లో వైసీపీని ముద్దాయిగా చేయాలని చూస్తోంది టీడీపీ. ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లి వీడియో బయటకొచ్చాక ఈ దాడి మరింత ఉధృతమైంది. పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ నెపంతో వైసీపీపై, జగన్ పై విమర్శలతో విరుచుకుపడొచ్చని మాస్టర్ ప్లాన్ వేసింది. కానీ చివరకు టీడీపీ కల నెరవేరలేదు. పిన్నెల్లి అరెస్ట్ ఆగిపోయింది. జూన్-5 వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఈలోగా కేసు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పిన్నెల్లి అరెస్ట్ అంటూ ఎల్లో మీడియా హడావిడి చేసింది, ఆయన వీసా అవసరంలేని విదేశాలకు పారిపోయారంటూ కూడా కథలల్లారు. కానీ పిన్నెల్లి మాత్రం న్యాయస్థానం ద్వారా ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలనుకున్నారు. కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు జూన్-5 వరకు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు సూచించింది. దీంతో టీడీపీ శిబిరం నిరాశపడింది.
పల్నాడు ఎన్నికల్లో చాలా చోట్ల గందరగోళం చోటు చేసుకుంది. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ వ్యవహారాలు బయటకు రాలేదు కానీ, ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టిన వీడియో మాత్రమే బయటకు వచ్చింది. అది కూడా నారా లోకేష్ ట్వీట్ వేయడంతోనే వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో కుట్రకోణం ఉందంటూ వైసీపీ ఆరోపించింది. ఆ ఒక్క వీడియోనే ఎలా బయటకు వచ్చిందని సూటిగా ప్రశ్నించారు వైసీపీ నేతలు. ఈ ప్రశ్నకు ఈసీ వద్ద కూడా సమాధానం లేదు. దీంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. చివరకు పిన్నెల్లికి హైకోర్టులో ఊరట లభించడం ఈ ఎపిసోడ్ లో కీలక మలుపుగా మారింది.