పవన్ కోసం రంగంలోకి దిగిన చంద్రబాబు
వలంటీర్లపై చంద్రబాబునాయుడు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. మహిళాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో మాట్లాడుతూ.. చెప్పుతో కొట్టేవాళ్ళు లేక వలంటీర్లు రెచ్చిపోతున్నారంటు మండిపోయారు.
నాలుగు రోజులుగా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయిన చంద్రబాబునాయుడు కూడా వలంటీర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. మహిళాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో మాట్లాడుతూ.. వలంటీర్లపై నోరుపారేసుకున్నారు. చెప్పుతో కొట్టేవాళ్ళు లేక వలంటీర్లు రెచ్చిపోతున్నారంటు మండిపోయారు. ప్రజల ఇళ్ళల్లోకి వలంటీర్లు చొరబడుతున్నారంటూ ఊగిపోయారు. మగవాళ్ళు లేనప్పుడు వలంటీర్లు ఇళ్ళల్లోకి ఎందుకు వస్తున్నారంటు నిలదీశారు.
గతంలో కూడా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వలంటీర్లు వచ్చి ఆడవాళ్ళని ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలపై బాగా గోల జరిగింది. దాంతో మళ్ళీ ఎప్పుడూ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. మళ్ళీ ఇంతకాలానికి మిత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే చంద్రబాబుకు కూడా ఊపొచ్చినట్లుంది. అందుకనే నోరుపారేసుకుంటున్నారు.
రాష్ట్రంలో 22,278 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయినట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలే చెబుతున్నట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే గడచిన రెండేళ్ళలో కిడ్నాపులు, అపహరణల కేసుల్లో ఏపీ 18వ స్ధానంలో ఉంది. గడచిన రెండేళ్ళల్లో ఈ పద్ధతిలో నమోదైన కేసులు కేవలం 870 మాత్రమే. కిడ్నాపులు, అపహరణలకు గురైన కేసులు 870 మాత్రమే అని కేంద్ర హోంశాఖ చెబుతుంటే చంద్రబాబేమో 22 వేల మంది కనబడటంలేదని, పవనేమో 14 వేల మంది మిస్సింగని చెప్పటంలో అర్థంలేదు. వారాహి యాత్ర రెండో విడత కార్యక్రమంలో హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్లే కారణమని పవన్ చేసిన ఆరోపణలపై వలంటీర్లు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.
దాంతో ఏమి మాట్లాడాలో చంద్రబాబుకు అర్థంకాలేదు. మూడు రోజుల పాటు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పవన్ వ్యాఖ్యలపై ఇంతస్థాయిలో నిరసన తెలుపుతారని ఊహించలేదేమో. ఏమనుకున్నారో ఏమో నాలుగు రోజులు గడిచేటప్పటికి వలంటీర్లకు వ్యతిరేకంగా చంద్రబాబు కూడా ఆరోపణలు మొదలుపెట్టారు.
మ్యాపింగ్ చేయటం కోసం టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంటికి తాను వెళ్ళినపుడు నిర్భందించినట్లు ఒక మహిళా వలంటీర్ ఆరోపించారు. అదేంలేదు మహిళా వలంటీరే యరపతి ఇంట్లోకి జోరబడి ఆడవాళ్ళ ఫొటోలు తీసినట్లు ఎల్లో మీడియా చెబుతోంది. ఇందులో ఏది వాస్తవమో తెలియదు. దీన్ని పట్టుకుని చెప్పుతో కొట్టేవాళ్ళు లేక వలంటీర్లు రెచ్చిపోతున్నారంటు చంద్రబాబు రెచ్చిపోయారు. మరి ఈ వ్యాఖ్యలపై వలంటీర్ల స్పందన ఎలాగుంటుందో చూడాలి.