Telugu Global
Andhra Pradesh

పీక్కోమని చాలెంజ్ చేసి ఇప్పుడు గోలేంటి..?

ఫైబర్ నెట్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారిన ఆరోపణలపై విచారణ అనగానే స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై విచారణ అనగానే వెంటనే తమ్ముళ్ళు స్టే తెచ్చేసుకుని విచారణను అడ్డుకున్నారు

పీక్కోమని చాలెంజ్ చేసి ఇప్పుడు గోలేంటి..?
X

గడచిన నాలుగేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు అండ్ కో ఒకటే మాట చెప్పేవాళ్ళు. ఎన్ని విచారణలైనా చేసుకో, ఎన్ని కేసులైనా పెట్టుకుని ఏం పీక్కుంటావో పీక్కో అని చాలెంజ్ చేసేవారు. చంద్రబాబు, లోకేష్ అయితే జగన్‌ను ఉద్దేశించి ఏం పీక్కుంటారో పీక్కో, చిటికెన వేలుమీద వెంట్రుక కూడా పీకలేవు అని పదేపదే రెచ్చగొట్టారు. ఇలా ఏం పీక్కుంటావో పీక్కోమంటారు.. పీకటానికి రెడీ అవగానే వెంటనే కోర్టులో స్టే తెచ్చేసుకుంటారు.

అమరావతి భూసమీకరణలో పెద్దఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే విచారణ చేయిస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ మొదలుపెట్టించారు. వెంటనే తమ్ముళ్ళు హైకోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముసుగులో అవినీతి జరిగిందని విచారణ చేయిద్దామని అనుకుంటే కోర్టులో కేసువేశారు. దాంతో విచారణ ముందుకు వెళ్ళలేదు.

ఫైబర్ నెట్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారిన ఆరోపణలపై విచారణ అనగానే స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై విచారణ అనగానే వెంటనే తమ్ముళ్ళు స్టే తెచ్చేసుకుని విచారణను అడ్డుకున్నారు. భూసమీకరణలో భాగంగా అసైన్‌మెంట్ ల్యాండ్స్ కుంభకోణం జరిగిందని, విచారణ చేయించాలని అనుకున్నది. దీనిపైన కూడా విచారణ జరగకుండా టీడీపీ నేతలు స్టేలు తెచ్చుకున్నారు. ఆరోపణ ఏదైనా, విచారణ ఏదైనా వెంటనే స్టేలు తెచ్చేసుకోవటం మళ్ళీ జగన్‌ను పట్టుకుని ఏం పీక్కుంటారో పీక్కోమని చాలెంజ్‌లు చేయటం మామూలైపోయింది.

వివిధ విచారణలపై ఉన్న స్టేలను తొలగించుకునేందుకు ప్రభుత్వానికి ఇంతకాలం పట్టింది. అందుకనే అమరావతి భూ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కుంభకోణం, అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణంపై విచారణ జరపకూడదన్న స్టేలను సుప్రీంకోర్టు ఎత్తేసింది. దాంతో ఇప్పుడు విచారణలు మొదలవుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ఉంటున్న కరకట్ట మీద లింగమనేని భవనాన్ని జప్తుచేసింది. దాంతో తమ్ముళ్ళతో పాటు ఎల్లోమీడియా కూడా వేధింపులు, కక్షసాధింపులంటూ గోల మొదలుపెట్టారు. ఇప్పుడు మాత్రం ఏం పీక్కుంటావో పీక్కోమని చాలెంజ్ చేయటంలేదు.

First Published:  17 May 2023 5:55 AM GMT
Next Story