Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుపై ఏకధాటిగా టీవీ9

టీవీ9 ఇలా రెండు రోజుల తర్వాత దాడికి దిగడం అంతా వైసీపీ ప్లాన్‌లో భాగమేనని టీడీపీ నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

చంద్రబాబుపై ఏకధాటిగా టీవీ9
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఐటీ నోటీసులు జారీ చేసిన అంశం రెండు రోజులు క్రితం మీడియా దృష్టికి వచ్చింది. హిందుస్తాన్‌ టైమ్స్‌ ఆ విషయాన్ని తొలుత ప్రచురించగా... రెండు రోజులు నుంచి సాక్షి మీడియా మాత్రమే ఆ అంశంపై ప్రధానంగా వార్తలు వేస్తోంది. మిగిలిన చానల్స్‌ పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీకి అనుకూలమని పేరున్న చానళ్లు చిన్న వార్తగా కూడా ఇవ్వలేదు. పైగా అది పాత వ్యవహారం అంటూ దాటేస్తోంది.

రెండు రోజుల తర్వాత టీవీ9 ఈ అంశంపై దృష్టి సారించిన తీరు పట్ల టీడీపీ వర్గీయులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచే చంద్రబాబుకు ఐటీ నోటీసులపై టీవీ9 హడావుడి మొదలుపెట్టింది. ఉదయం 9 నుంచి ప్రతి బులిటెన్‌లోనూ 10, 15నిమిషాల పాటు ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. చంద్రబాబుకు రూ.118 కోట్లు ఎక్కడి నుంచి అందాయని అని ప్రశ్నించింది.

నోటీసులపై చంద్రబాబు లేవనెత్తిన అభ్యంతరాలను ఐటీ తిరస్కరించిందని ఆ చానల్ వివరించింది. డబ్బులు చంద్రబాబుకు అందిన విధానాన్ని ఆధారాలతో సహా ఐటీ గుర్తించిందని ప్రధానంగా ప్రసారం చేసింది. బులిటెన్ పూర్తయిన తర్వాత స్క్రోలింగ్‌లోనూ చంద్రబాబు నోటీసుల అంశమే ప్రధానంగా వేస్తోంది. టీవీ9 ఇలా రెండు రోజుల తర్వాత దాడికి దిగడం అంతా వైసీపీ ప్లాన్‌లో భాగమేనని టీడీపీ నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

టీవీ9 తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తోందని, అందుకే కొన్ని నెలల క్రితమే చంద్రబాబు కూడా టీవీ9ను బహిష్కరించాల్సిందిగా పిలుపునిచ్చారని గుర్తు చేస్తున్నారు. అయితే నోటీసులు వచ్చిన మాట వాస్తవమే అయినప్పుడు, చంద్రబాబు నోరు మెదపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మీడియా నిలదీయడంలో తప్పేంటని తటస్థ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

First Published:  3 Sept 2023 12:41 PM IST
Next Story