జగనన్నకు చెబుదాం.. అల్లరి పట్టిద్దాం..?
నిజమైన ఇబ్బందులున్న వారికి కాల్ కలిసే అవకాశం లేకుండా టీడీపీ శ్రేణులే పెద్ద ఎత్తున ఈ తరహా టైంపాస్ కాల్స్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
ప్రజల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ''జగనన్నకు చెబుదాం'' పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. మంచిదే.. ఎవరికైనా పరిష్కారం కానీ సమస్యలుంటే ఈసారి సీఎంవో స్థాయిలో స్పందన ఉంటుంది. ఇప్పటికే అనేక మంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా అల్లరి పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది.
ప్రతి వ్యక్తి చేతిలో ఎలాగో ఫోన్ ఉంటుంది కాబట్టి ''జగనన్నకు చెబుదాం'' టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసేలా టీడీపీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారు. కాల్ చేసి కాల్ సెంటర్ సిబ్బందిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడడం.. పనిగట్టుకుని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ప్రశ్నలు అడగటం చేస్తున్నారు. ''జగనన్నకు చెబుదాం'' అని పేరు పెట్టారు కాబట్టి మేం జగన్‌తోనే మాట్లాడుతాం.. లైన్ కలపండి అంటూ వాదనకు దిగుతున్నారు.
నిజమైన ఇబ్బందులున్న వారికి కాల్ కలిసే అవకాశం లేకుండా టీడీపీ శ్రేణులే పెద్ద ఎత్తున ఈ తరహా టైంపాస్ కాల్స్ చేస్తున్నట్టు చెబుతున్నారు. కొందరు ఆకతాయిలు కాల్ చేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. కొందరు తాము భలే వాదించాం అనిపించుకునేందుకు కాల్ సెంటర్ సిబ్బందితో మాట్లాడిన మాటలను రికార్డు చేస్తున్నారు. ఈ తతంగానికి తొలుత వర్ల రామయ్య నాంది పలికారు.
వర్ల రామయ్య టీడీపీ ఆఫీస్‌లోని సిబ్బందిని తనతో పాటు ఒక గదిలో పెట్టుకుని అందరూ ఒకేసారి 1902కు కాల్స్ చేశారు. కాల్ సెంటర్ సిబ్బందితో దురుసుగా మాట్లాడారు. నేరుగా సీఎం మాట్లాడే అవకాశం ఉండదని తెలిసి కూడా తాను జగన్‌మోహన్ రెడ్డికే సమస్య చెప్పుకుంటా అంటూ వర్ల రామయ్య పట్టుపట్టారు. కాల్ సెంటర్ సిబ్బందిని బెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ శ్రేణులు ఎక్కువగా లిక్కర్ గురించి కాల్స్ చేస్తున్నట్టు చెబుతున్నారు. కొందరు రాజధాని ఏదో జగన్‌తో మాట్లాడి కనుక్కుంటాం అంటూ అల్లరి చేస్తున్నారు.
ఈ కార్యక్రమం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది అన్నది తర్వాతి అంశం. ఉద్దేశం అయితే మంచిదే. ''జగనన్నకు చెబుదాం'' కాల్ సెంటర్ సీఎంవో స్థాయిలో నడుస్తోంది. ప్రజలకు ఇది చక్కటి అవకాశం. అలాంటి కార్యక్రమాన్ని అల్లరి చేయాలన్న టీడీపీ ఉద్దేశం విమర్శలకు తావిస్తోంది.