Telugu Global
Andhra Pradesh

అమిత్ షా కరుణించాడు.. ఫొటోలు బయటకొచ్చాయి

బీజేపీ 10 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ స్థానాలు అడిగిందని, టీడీపీ 6-4కి ఒప్పుకుందని ఎల్లో మీడియా కథనాల సారాంశం.

అమిత్ షా కరుణించాడు.. ఫొటోలు బయటకొచ్చాయి
X

ఆమధ్య చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధినాయకత్వంతో చర్చలు జరిపారని ఎల్లో మీడియా కథనాలిచ్చింది కానీ, ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. ఇదేదో తేడాగా ఉందని సొంత పార్టీ నేతల నుంచే సెటైర్లు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో మంతనాలు మొదలు పెట్టారు. ఈసారయినా కమలనాథులు కనికరిస్తారా, కాదుపొమ్మంటారా అనే సందిగ్ధం.. టీడీపీ-జనసేన నేతల్లో ఉంది. కానీ ఈసారి అమిత్ షా కరుణించినట్టు స్పష్టమైంది. ఆయనతో చిరునవ్వు చిందిస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు దిగారు. ఏపీలో కూటమి వ్యవహారంపై చర్చించారు.


కూటమి కుదిరినట్టే..

ఏపీలో ఒంటరి పోరుకంటే కూటమిలో చేరితే ఒకటీ అరా సీట్లు వస్తాయని బీజేపీ ఆలోచించినట్టుంది. అయితే చంద్రబాబుని బెదిరించేందుకే ఇన్నాళ్లూ పొత్తులపై నాన్చుతూ వచ్చింది. ఫైనల్ గా 6 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లతో బేరం తెగేలా ఉంది. బీజేపీ 10 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ స్థానాలు అడిగిందని, టీడీపీ 6-4కి ఒప్పుకుందని ఎల్లో మీడియా కథనాల సారాంశం. ఆల్రడీ లెక్కలు తేలినా కూడా.. ఇరు పార్టీల్లో అసంతృప్తులను బుజ్జగించేందుకు ఎల్లో మీడియాలో ఈమాత్రం డ్రామాలు తప్పవు.

ఎన్డీఏలోకి అంటూ బిల్డప్..

2019లో టీడీపీ నికరంగా గెలిచిన 3 ఎంపీ స్థానాల్లో కేశినేని నాని ఇప్పుడు వారితో లేరు, గల్లా జయదేవ్ రాజకీయాలనుంచే తప్పుకుంటానన్నారు, ఇక రాజ్యసభలో టీడీపీ స్కోర్ జీరో. ఇలాంటి పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారు అనే వార్త కామెడీగా ఉంటుంది. ఆ మాటకొస్తే సీట్లు, ఓట్లు, చివరకు గుర్తు కూడా ఉందో లేదో అనుమానంగా ఉన్న జనసేన కూడా ఎన్డీఏ కూటమిలో భాగమేనని చెప్పుకుంటుంది. ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖాయమేనంటూ ఎల్లో మీడియా రెచ్చిపోవడం గమనార్హం. మొత్తమ్మీద ఏపీలో వైసీపీ ఊహించినట్టే రాజకీయం మలుపు తిరిగింది. చివరి నిమిషంలో బీజేపీ కూడా కూటమిలో చేరిపోయింది. ఇటువైపు జగన్ ఒక్కరే ఒంటరిగా బరిలో దిగుతున్నారు. ఇండియా కూటమి ప్రభావం ఏపీలో శూన్యం కాబట్టి వారిని లెక్కలోకి తీసుకోలేం. మొత్తమ్మీద 2024 ఏపీలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారే అవకాశముంది.

First Published:  8 March 2024 7:44 AM IST
Next Story