Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఆ 4 ఛానెళ్లపై నిషేధం.. ట్రాయ్‌కి వైసీపీ ఫిర్యాదు

ఈ ఛానెల్స్ నిలిపివేతపై టెలికాం రెగ్యూలెటరీ అథారిటీ ఆఫ్ ఇండియా - TRAIకి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీ ఎస్. నిరంజన్ రెడ్డి. సమాచారాన్ని తెలుసుకునే ప్రజల హక్కును టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏపీలో ఆ 4 ఛానెళ్లపై నిషేధం.. ట్రాయ్‌కి వైసీపీ ఫిర్యాదు
X

ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పలు మీడియా ఛానెల్స్ ప్రసారాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతుగా వార్తలు ప్రసారం చేసారన్న సాకుతో టీవీ9, NTV, సాక్షి, 10టీవీ ప్రసారాలపై నిషేధం విధించినట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ నేతలు స్థానిక కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ ఛానెల్స్ నిలిపివేతపై టెలికాం రెగ్యూలెటరీ అథారిటీ ఆఫ్ ఇండియా - TRAIకి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీ ఎస్. నిరంజన్ రెడ్డి. సమాచారాన్ని తెలుసుకునే ప్రజల హక్కును టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు నిరంజన్ రెడ్డి. ఈ విషయంలో ట్రాయ్ జోక్యం చేసుకోవాలని.. ప్రసారాలకు అంతరాయం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తన ఫిర్యాదులో పేర్కొంది వైసీపీ.


ఇక ఏపీలో మీడియా రెండుగా విడిపోయిన విషయం తెలిసిందే. రెండు పార్టీలు ఎల్లో మీడియా, బ్లూ మీడియా అంటూ పరస్పరం విమర్శలు సైతం చేసుకుంటాయి. టీడీపీకి మద్దతుగా నిలిచే ఛానళ్లని ఎల్లో మీడియా అని, వైసీపీకి సపోర్ట్‌ చేసే ఛానెళ్లని బ్లూ మీడియాగా ఆయా పార్టీల నేతలు పిలుచుకుంటున్నారు. జగన్‌ సైతం గతంలో చాలా బహిరంగ సభల్లో ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నానని చెప్పారు. ఇక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా నిలిచే ఛానెళ్లపై చర్యలు తీసుకోవడం లేదా వాటి ప్రసారాలు నిలిపివేయడం ఇప్పుడు ఓ ఆనవాయితీగా మారింది.

First Published:  11 Jun 2024 9:25 PM IST
Next Story