ఎన్టీఆర్-వైఎస్సార్‌ని బాగా వాడేస్తున్నారు..
టీడీపీ సోషల్ మీడియాలోనూ ప్రతీ రోజూ ఎన్టీఆర్ పేరుతో ఏదో ఒక కొటేషన్ ప్రత్యక్షమవుతుంది. పార్టీ ఈ పేపర్‌లోనూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన మంచి పనులు రోజుకొకటి చొప్పున ప్రచురిస్తున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విచిత్ర రాజకీయ వాతావరణం ఏపీలో నెలకొని ఉంటుంది. కుల, మత, ప్రాంతాలనే కాకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తులని వాడుకోవడంలో ఏపీ రాజకీయ పార్టీలకి సాటి ఏ పార్టీ రాదు. అధికార వైసీపీ తమ సోషల్‌మీడియా ఖాతాలు, మీడియాలోనూ నిత్యమూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జపం చేస్తూనే ఉంటారు. సాక్షి పేపర్‌లో రోజూ రాజశేఖర రెడ్డి ఫోటో, ఓ క్యాప్షన్ ఏళ్లుగా వేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ అక్కౌంట్లలో కూడా ప్రతీరోజూ రాజశేఖర రెడ్డి చేసిన పనులని ప్రస్తావిస్తూ ఒక పోస్టు మస్టుగా ఉండేలా చూస్తారు.
జయంతి, వర్థంతికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన విశేషాలు ఏమైనా వైసీపీ అధికారిక కార్యక్రమాల కిందే లెక్క. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రిగా పార్టీ ఓన్ చేసుకోవడం వెనక ఆయన కీర్తిప్రతిష్టలున్నాయి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో లక్షలాది మంది పేదల ఇంటి దేవుడయ్యాడు రాజశేఖర రెడ్డి. ఆ ఇమేజ్‌ని పార్టీ బలోపేతం కోసం, ఎన్నికల్లో ఓట్లు తెచ్చే ఓ ఫ్యాక్టర్‌గా వైసీపీ వాడుకుంటోందని విశ్లేషకుల అభిప్రాయం.
తెలుగుదేశం పార్టీ గత కొన్నాళ్లుగా స్వర్గీయ మాజీ సీఎం, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జపం చేస్తోంది. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాగేసుకున్నారని, వెన్నుపోటు పొడిచారని ప్రస్తుత టీడీపీ అధినేతపై ఆరోపణలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. నందమూరి తారకరామారావు పెట్టిన పార్టీ నుంచి ఆయననే బయటకి పంపేసినా, ఆ పేరు ఓ తారకమంత్రం. ఓట్ల కోసమైనా, జనాకర్షణ కోసమైనా.. ఇష్టం ఉన్నా, లేకపోయినా వాడక తప్పని పరిస్థితి. ఇటీవలే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని తెలుగుదేశం పార్టీ అత్యంత వైభవంగా నిర్వహించింది. ఏడాదిపాటు శకపురుషుడు పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ సోషల్ మీడియాలోనూ ప్రతీ రోజూ ఎన్టీఆర్ పేరుతో ఏదో ఒక కొటేషన్ ప్రత్యక్షమవుతుంది. పార్టీ ఈ పేపర్‌లోనూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన మంచి పనులు రోజుకొకటి చొప్పున ప్రచురిస్తున్నారు.
సందర్భం ఏదైనా తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ నామస్మరణ కామన్ అయ్యింది. ప్రతీ ప్రసంగంలో ఎన్టీఆర్ ప్రస్తావన ఉండేలా చూసుకుంటున్నారు. బతికి ఉన్నప్పుడు పార్టీ నుంచి తరిమేసినా.. చనిపోయాక ఎన్టీఆర్ పేరుని వాడకుండా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరగడంలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అటు వైసీపీ వైఎస్సార్‌ని, ఇటు టీడీపీ ఎన్టీఆర్ పేరుని ఒక రేంజులో వాడేస్తున్నాయి. తమని పవర్‌లోకి తెచ్చే `పవర్` ఉన్న ఈ రెండు పేర్లే ఇప్పుడు అధికార, ప్రతిపక్షానికి ఓట్లు పంట పండించే మంత్రాలు.