లేటు చేస్తే ఇద్దరూ మునగటం ఖాయమేనా?
ఎందుకంటే పొత్తుల్లో పలానా సీట్లను జనసేనకు కేటాయిస్తున్నట్లు చివరి నిమిషంలో చంద్రబాబు ప్రకటిస్తే తమ్ముళ్ళు ఊరికే కూర్చోరు. పార్టీలోనే ఉండి జనసేనను దెబ్బకొట్టడమో లేకపోతే తిరుగుబాటు చేసి రెండు పార్టీలకు నష్టం చేయటమో గ్యారెంటీ.
వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని ఇద్దరికీ చాలా బలంగా ఉంది. కానీ బీజేపీకి భయపడి ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటన చేయలేకపోతున్నారు. ఎందుకంటే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నంతవరకు జనసేన-టీడీపీ కలిసే అవకాశమే లేదు. దాంతో ఏమిచేయాలో ఇద్దరికీ అర్ధంకాక నానా అవస్తలు పడుతున్నారు. ఇదంతా చంద్రబాబు, పవన్ గురించేనని ఈ పాటికే అర్ధమైపోయి ఉంటుంది.
వీళ్ళద్దరి తాజా భేటీ తర్వాత చాలా ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇద్దరు కూడా పిరికివాళ్ళుగానే ఉన్నారు. రాజకీయాల్లో ప్రతి పరిస్థితి అనుకూలంగానే ఉండదన్న విషయాన్ని వీళ్ళు మరచిపోయారు. రాజకీయాల్లో కొన్నిసార్లు తెగింపు చాలా ముఖ్యం. అది లేకపోతే ఎంతకాలమైనా ముసుగులో గుద్దులాడుకోవటం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని గ్రహించాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే టీడీపీ, జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని అందరు అనుకుంటున్నదే.
అయితే ఆ విషయాన్ని నిజం చేసేందుకు అధినేతలు భయపడుతున్నారు. ఇలాగే విషయాన్ని నాన్చుతుంటే చివరకు ఇద్దరూ మునగటం ఖాయం. ఎలాగంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలను నియమించకుండా చంద్రబాబు చాలాకాలంగా నెట్టుకొస్తున్నారు.
జనసేనతో పొత్తుంటుందన్న ఉద్దేశంతోనే ఇన్‌చార్జిలను నియమించలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది. దీనివల్ల నేతల్లో అయోమయం పెరిగిపోయి నియోజకవర్గాల్లో పార్టీ బలహీనపడింది. అలాగే ఇన్‌చార్జిలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా పొత్తుల్లో వేటిని వదులుకుంటారో నేతలకు అర్ధంకావటంలేదు. ఇన్‌చార్జిల హోదాలో లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకుని చివరలో నియోజకవర్గం చేజారిపోతే ఏమి చేయాలనే టెన్షన్ చాలా మందిలో పెరిగిపోతోంది.
ఇలాంటి గందరగోళం కంటిన్యు కాకుండా ధైర్యంగా పొత్తు పెట్టుకుని నియోజకవర్గాలను కూడా ఫైనల్ చేసేసుకుంటే తమ్ముళ్ళల్లో క్లారిటి వచ్చేస్తుంది. ఎక్కడైనా అసంతృప్తులుంటే వాళ్ళని బుజ్జగించి దారికి తెచ్చుకునేందుకు సమయం కూడా ఉంటుంది.
అలాకాదని చివరి నిముషం వరకు ఏమీ తేల్చకుండా నాన్చితే రెండు పార్టీలు నష్టపోవటం ఖాయం. ఎందుకంటే పొత్తుల్లో పలానా సీట్లను జనసేనకు కేటాయిస్తున్నట్లు చివరి నిమిషంలో చంద్రబాబు ప్రకటిస్తే తమ్ముళ్ళు ఊరికే కూర్చోరు. పార్టీలోనే ఉండి జనసేనను దెబ్బకొట్టడమో లేకపోతే తిరుగుబాటు చేసి రెండు పార్టీలకు నష్టం చేయటమో గ్యారెంటీ. కాబట్టి పరిస్థితిని అంతవరకు తెచ్చుకోకుండా ఇప్పుడు ధైర్యం చేస్తేనే ఏమైనా లాభముంటుంది.