కూటమిలో బీజేపీ లేనట్టే.. టీడీపీ, జనసేనలోనే సిగపట్లు
సీట్ల లెక్క తేల్చేందుకు ఈనెల 8న మరోసారి టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశం ఉంటుందని అంటున్నారు. ఈనెల 14న పాలకొల్లులో ఉమ్మడి సభ.. మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది.
బీజేపీతో జనసేన పొత్తు, జనసేనతో టీడీపీ పొత్తు.. సో ఏపీలో మూడు రాష్ట్రాలు పొత్తులో ఉన్నాయనే ప్రచారం ఇప్పటి వరకు జరిగింది. అయితే టీడీపీ-జనసేన మాత్రమే ఇప్పుడు సీట్ల పంపకాలకు కూర్చున్నాయి. బీజేపీ నుంచి కనీస స్పందన కూడా లేకపోవడంతో చివరికి రెండు పార్టీలు మాత్రమే కలసి బరిలో దిగాలని నిర్ణయించుకున్నాయి. ఎలాగూ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంటుంది కాబట్టి వామపక్షాల చూపు దాదాపుగా ఆవైపే ఉంటుందనుకోవాలి. రాగా పోగా జనసేనకు టీడీపీ విదిల్చే సీట్లు ఎన్ని, ఏవి అనేవి ఇప్పుడు అసలు ప్రశ్నలు.
చంద్రబాబు-పవన్ కల్యాణ్ మధ్య సీట్ల చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ విషయంలో ఎల్లో మీడియా లెక్కలను పక్కా చేసుకోవచ్చు. జనసేన 32 సీట్లు అడిగితే, చంద్రబాబు 25కి తెగ్గొట్టేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. 3 ఎంపీసీట్లు కూడా జనసేనకు టీడీపీ ఇవ్వొచ్చని తెలుస్తోంది. అంటే ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చినా.. జనసేన తోకజాడించే అవకాశం లేకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారని అర్థమవుతోంది. ఇక జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే అంటూ ఎల్లోమీడియా ఊదరగొడుతోంది. గోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
ఈనెల 14లోపు క్లారిటీ..
సీట్ల లెక్క తేల్చేందుకు ఈనెల 8న మరోసారి టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశం ఉంటుందని అంటున్నారు. ఈనెల 14న పాలకొల్లులో ఉమ్మడి సభ.. మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల లిస్ట్ కూడా బయటపెట్టే అవకాశముంది. ఈసారి పవన్ కల్యాణ్ ఒకే స్థానం నుంచి పోటీ చేస్తారు. లోకేష్ ఆల్రడీ మంగళగిరి ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి ప్రచారంలో దిగారు. పవన్ మాత్రం నియోజకవర్గం ఖరారు చేసుకుని దానిపై పూర్తి స్థాయిలో దృష్టిపెడతారు. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. కనీసం పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు, పార్టీ భవిష్యత్తుకు అత్యవసరం. అందుకే ఆ దిశగా పవన్ వ్యూహరచనలో ఉన్నారు.