పొత్తులతో చిత్తయ్యేది ఎవరు..? ఆందోళనలో ఆశావహులు..
మూడేళ్లుగా పార్టీకోసం కష్టపడి, చివరకు ఎన్నికలనాటికి టీడీపీకి జై అనాల్సి వస్తుందేమోనని మనసు కష్టపెట్టుకుంటున్నారు కొంతమంది జనసేన నేతలు. పొత్తులతో చిత్తవుతామని భయపడుతున్నారు.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పొడిచేందుకు దాదాపు మార్గం సుగమం అయింది. అధికారిక ప్రకటనే తరువాయి. అయితే ఇప్పుడే ఈ విషయంలో రెండు పార్టీలు ప్రకటన చేయకపోవచ్చు. మరింతగా వేచి చూసి ఎన్నికల సమయంలో పొత్తులు ఖరారు చేసుకోవచ్చు. పొత్తులు లేటవ్వచ్చేమో కానీ, పొత్తు మాత్రం పక్కా.
ఏపీ అసెంబ్లీకి ఉన్న సీట్లు 175. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా దాదాపు 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపేందుకు జనసేన సన్నాహాలు చేసుకుంటోంది. ఇప్పుడు టీడీపీతో కలిస్తే పొత్తులో కచ్చితంగా సీట్లు కోల్పోవాల్సి ఉంటుంది. మూడు పార్టీలు కలసినా, లేదా కేవలం టీడీపీతో మాత్రమే పొత్తు పెట్టుకున్నా కూడా చంద్రబాబు 26కి మించి జనసేనకు సీట్లు ఆఫర్ చేసే అవకాశం లేదు. జిల్లాకు ఒక సీటు చొప్పున అవకాశం ఇస్తారనే అంచనాలున్నాయి. మరీ పట్టుబడితే టీడీపీ నేతలకే కండువాలు మార్చి జనసేన తరపున బరిలో దింపొచ్చు. ఆ ఒప్పందంతో జిల్లాకు రెండు స్థానాలు ఇచ్చినా 52కంటే ఎక్కువ స్థానాలు జనసేనకు రాకపోవచ్చు. అందులో ఒరిజినల్ జనసేన నేతలు కేవలం పాతికమందే ఉంటారు. మరి మిగతావారంతా త్యాగరాజులుగా మారిపోవాల్సిందేనా.
ఆశావహుల్లో ఆందోళనలు..
ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జనసేనకు ఇన్ చార్జ్ లు ఉన్నారు. 25 మంది ఇన్ చార్జ్ లు టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే నీరసపడిపోయారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తమకి సీటు రాకపోవచ్చని, ఒకవేళ పోటీకి అనుమతి ఇచ్చినా, తాము కోరుకున్న నియోజకవర్గం రాకపోవచ్చనే అనుమానం అందరిలో ఉంది. అందుకే ముందుగానే వారిలో అభద్రతా భావం మొదలైంది. జనసేన తరపున పోటీ చేస్తే గెలిచేస్తామనే ధీమా లేకపోయినా, కనీసం పార్టీ నాయకుడిగా జనాల్లో గుర్తింపు ఉంటుందనే ఆలోచన కొందరిది. అది కూడా ఇప్పుడు కరువయ్యే ప్రమాదం ఉంది. మూడేళ్లుగా పార్టీకోసం పాటుపడి, చివరకు ఎన్నికలనాటికి టీడీపీకి జై అనాల్సి వస్తుందేమోనని మనసు కష్టపెట్టుకుంటున్నారు.
కిం కర్తవ్యం..
టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే నాయకులకు మరో ప్రత్యామ్నాయం కూడా ఉండదు. అటు వైసీపీలోకి వెళ్లే అవకాశం కూడా లేదు. అక్కడే పోటీ ఎక్కువ. రెబల్ గా పోటీ చేసినా సాధించేది శూన్యం. అందుకే ఆశావహులంతా ఇకపై చేతి చమురు వదిలించుకోవడం తగ్గించుకోవాలని డిసైడ్ అవుతున్నారట. ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నా.. పొత్తు ఖరారయితే మాత్రం జనసేనలో చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయే ఛాన్స్ లు ఉన్నాయి.