Telugu Global
Andhra Pradesh

గంజాయి బ్యాచ్ అనే నోళ్లకు తాళం పడుతుందా..?

చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో ప్రతి సిటీకి గంజాయి సిటీ అని నామకరణం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారంపై ఈసీ దృష్టిసారించాలని అంటున్నారు నెటిజన్లు.

గంజాయి బ్యాచ్ అనే నోళ్లకు తాళం పడుతుందా..?
X

ఏపీలో తప్పుడు ప్రచారాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ఎన్నికల కమిషన్. పదే పదే అవే అబద్ధాల్ని ప్రచారం చేస్తూ ప్రజల మెదళ్లలోకి విషాన్ని చొప్పించాలని చూస్తున్న చంద్రబాబు అండ్ కో కి కాస్త గట్టిగానే గడ్డిపెట్టింది ఈసీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్ర సీఈఓ ఇచ్చిన సమాచారం మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ యాక్ట్ గురించి అవాకులు, చెవాకులు పేలొద్దని చంద్రబాబు అండ్ కో కి వార్నింగ్ ఇచ్చే అవకాశాలున్నాయి.

ఇటీవల వైఎస్ వివేకా హత్యకేసుని కూడా ఇలాగే ప్రచారాస్త్రంగా వాడుకోవాలనుకున్నారు చంద్రబాబు. ఆయన సూచనలతోనే షర్మిల, సునీత.. ఆ ప్రచారాన్ని తలకెత్తుకున్నారు. అవినాష్ రెడ్డి, జగన్ ని టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కోర్టులో విచారణ పూర్తి కాకముందే హంతకుడు ఫలానా ఆంటూ బురదజల్లుతున్నారు. ఈ తప్పుడు ప్రచారం ఆపాలని ఇటీవలే కడప కోర్టు ఆదేశాలిచ్చింది.

గంజాయిపై కూడా అబద్ధాలు..

ఇటీవల చంద్రబాబు ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, యువత మత్తులో మునిగిపోతోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాకినాడ సభలో కూడా ఆయన ఇవే వ్యాఖ్యలు చేశారు. "ఏం తమ్ముళ్లూ అయిదేళ్లలో ఏమైంది. రౌడీయిజం, నేరాలు పెరిగాయా లేదా..? గంజాయి వచ్చిందా లేదా..? ఏమిటీ అరాచకం". అంటూ వెటకారం చేశారు. ఆమధ్య కిరాణా షాపుల్లో కూడా గంజాయి అమ్ముతున్నారంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తే.. షాపుల యజమానులంతా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

గంజాయి బ్యాచ్, గంజాయి సిటీలు అంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తిగా నిరాధారమైనవి. గంజాయి రవాణాను ఎక్కడికక్కడ ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. అయినా కూడా చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో ప్రతి సిటీకి గంజాయి సిటీ అని నామకరణం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారంపై ఈసీ దృష్టిసారించాలని అంటున్నారు నెటిజన్లు. ఏపీపై తప్పుడు బ్రాండ్ వేయాలని చూస్తున్న చంద్రబాబు నోరు కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  5 May 2024 2:50 AM GMT
Next Story