Telugu Global
Andhra Pradesh

సుప్రీం వ్యూహంపై మండిపడ్డ టీడీపీ, బీజేపీ..

వ్యూహాత్మకంగా బంతి సుప్రీంకోర్టులో వేసింది ఏపీ ప్రభుత్వం. అంటే ఇప్పుడీ కేసు హైకోర్టు పరిధి దాటింది, సుప్రీంలో విచారణ జరుగుతోందన్న పేరుతో ప్రభుత్వం రిలాక్స్ గా ఉండొచ్చు. ఈ వ్యూహంతో ప్రతిపక్షాలకు మాత్రం వైసీపీ షాకిచ్చినట్టయింది.

సుప్రీం వ్యూహంపై మండిపడ్డ టీడీపీ, బీజేపీ..
X

ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది వైసీపీ. అయితే హైకోర్టు తీర్పు వచ్చినప్పుడే చేయాల్సిన పనిని ఆరు నెలల ఆలస్యంగా మొదలు పెట్టింది. ఇది కూడా ఓ వ్యూహంలో భాగమే. ఆరునెలలు కాలయాపన చేసి ఇప్పుడు హైకోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల్లో అభివృద్ధి సాధ్యం కాదంటూ సుప్రీం తలుపు తట్టింది. మరి ఈ వ్యూహం బెడిసికొడుతుందా, లేక సుప్రీం తీర్పు వచ్చే నాటికి ఎన్నికలకి కూడా వైసీపీ సిద్ధమవుతుందా అనేది వేచి చూడాలి.

ప్రతిపక్షాలకు ఝలక్..

సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని వ్యవహారం ఇప్పుడల్లా తేలుతుందని అనుకోలేం. హైకోర్టు తీర్పు ఆరు నెలల్లో అమలు చేయాల్సిన సందర్భంలో ఎలాగూ ఆ టైమ్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు కోర్టు మరోసారి ఈ విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేయొచ్చు. లేదా వైరివర్గం వారు హైకోర్టు తీర్పుని ప్రభుత్వం అమలు చేయలేదంటూ మరోసారి న్యాయ స్థానాన్ని ఆశ్రయించే అవకాశమూ ఉంది. దీంతో వ్యూహాత్మకంగా బంతి సుప్రీంకోర్టులో వేసింది ప్రభుత్వం. అంటే ఇప్పుడీ కేసు హైకోర్టు పరిధి దాటింది, సుప్రీంలో విచారణ జరుగుతోందన్న పేరుతో ప్రభుత్వం రిలాక్స్ గా ఉండొచ్చు. ఈ వ్యూహంతో ప్రతిపక్షాలకు మాత్రం వైసీపీ షాకిచ్చినట్టయింది. హైకోర్టు తీర్పుని అపహాస్యం చేస్తున్నారంటూ మరోసారి వైసీపీని ఇరుకునపెట్టాలనుకున్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి.

ఏపీ ప్రజల ఆకాంక్షలను సుప్రీంకోర్టు కాదనదని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతి రైతుల పోరాటం వృథాగా పోదన చెప్పారాయన. సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి భంగపాటు తప్పదని అన్నారు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్. అమరావతి రైతుల మహా పాదయాత్ర విజయవంతం అయి తీరుతుందని చెప్పారు. చట్టసభల నిర్ణయాన్ని తప్పుపట్టేలా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వలేదని, కేవలం దురుద్దేశంతోనే ఉన్నత న్యాయస్థానం తీర్పును వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం చేపట్టకుండా 6 నెలలు కాలయాపన చేసి, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు.

అటు బీజేపీ కూడా ఈ వ్యవహారంపై మండిపడింది. రాజధాని అమరావతికి గతంలో మద్దతిచ్చిన జగన్‌, ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌. రాజధాని నిర్మించుకోలేని సీఎంగా జగన్ మిగిలిపోయారని, పరిపాలన వికేంద్రీకరణ ముసుగులో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థిస్తుందన్న నమ్మకం తమకుందని అన్నారు సత్యకుమార్.

First Published:  17 Sept 2022 4:58 PM IST
Next Story