బీజేపీతో పొత్తు.. చంద్రబాబు గాలి తీసేసిన విష్ణువర్ధన్ రెడ్డి
ఎవరినో భుజాన వేసుకుని మోయాల్సిన అవసరం తమకు లేదని, ఎవరినో సీఎంను చేసే పని తమది కాదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టంచేశారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి భారీ షాక్ ఇచ్చారు. ఆయన మాటలను బట్టి బీజేపీ అగ్ర నాయకత్వం చంద్రబాబుకు చెక్ పెట్టినట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. దీన్నిబట్టి తమ పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పొత్తుకు సిద్ధమని ఆ పార్టీ నాయకత్వం చంద్రబాబుకు తేల్చి చెప్పారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దానివల్లనే బీజేపీతో పొత్తుపై చంద్రబాబు పెదవి విప్పడం లేదా..?
ఎవరినో భుజాన వేసుకుని మోయాల్సిన అవసరం తమకు లేదని, ఎవరినో సీఎంను చేసే పని తమది కాదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టంచేశారు. దేశంలో అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీగా ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం తమకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ‘2014లో పరిస్థితి 2024లో లేదు, నిన్న నువ్వు బలమైన వ్యక్తివే కావచ్చు.. ఈ రోజు పరిస్థితి ఏమిటి?’ అని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బలం గతంలో కన్నా గణనీయంగా తగ్గిందనే అంచనాకు బీజేపీ వచ్చినట్లు విష్ణువర్ధన్ మాటలు తెలియజేస్తున్నాయి.
చంద్రబాబును బీజేపీ నాయకత్వమే పొత్తులపై మాట్లాడడానికి పిలిచారని ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాకు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గట్టి షాకే ఇచ్చారు. ‘ఎవరు ఎవరి అపాయింట్‌మెంట్ కోరుతున్నారు? ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఇద్దరిలో ఎవరూ చెప్పలేదు’ అని అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు, ఎల్లో మీడియా గాలి తీసేశారు.