Telugu Global
Andhra Pradesh

కూటమి మేనిఫెస్టో.. చంద్రబాబు మైండ్ గేమ్

చంద్రబాబులో మళ్లీ చంద్రముఖి మేల్కొంది. తన అబద్ధాలను మరింత గట్టిగా, బలంగా చెప్పాలని డిసైడ్ అయ్యారు. అందుకే కూటమి మేనిఫెస్టో విడుదల అంటూ హడావిడి మొదలు పెట్టారు బాబు.

కూటమి మేనిఫెస్టో.. చంద్రబాబు మైండ్ గేమ్
X

గతంలోనే టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రకటించింది. ఆ తర్వాత సూపర్ సిక్స్ పేరుతో మరికొన్ని పథకాలు కూడా ప్రకటించింది. జనసేన, బీజేపీ ప్రత్యేకంగా హామీలివ్వకపోయినా.. ప్రస్తుతానికి సూపర్ సిక్స్ నే వారుకూడా హైలైట్ చేస్తున్నారు. ఈ దశలో ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో కూడా బయటకు వచ్చింది. గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తూ.. అమ్మఒడి, రైతు భరోసా, సామాజిక పెన్షన్ల వంటి వాటిని పెంచి ఇస్తానని చెప్పారు సీఎం జగన్. దీంతో చంద్రబాబులో మళ్లీ చంద్రముఖి మేల్కొంది. తన అబద్ధాలను మరింత గట్టిగా, బలంగా చెప్పాలని డిసైడ్ అయ్యారు. అందుకే కూటమి మేనిఫెస్టో విడుదల అంటూ హడావిడి మొదలు పెట్టారు బాబు. ఈనెల 30 మంగళవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని టీడీపీ కార్యాలయంలో మూడు పార్టీల నేతలు ఈ కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తారు.

ఏమేముంటాయి..?

పెన్షన్ల పెంపు, తల్లికి వందనం పేరుతో కుటుంబంలోని అందరు బిడ్డలకూ అమ్మఒడి, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వాలంటీర్లకు రూ.10వేల గౌరవ వేతనం.. వంటివి ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వీటికి తోడు మరిన్ని ఉచితాలను చంద్రబాబు ప్రకటించే అవకాశముంది. జగన్ మరీ అతిగా హామీలు ఇవ్వకపోవడంతో చంద్రబాబు కొత్త ఎత్తులు వేయాలనుకుంటున్నారు. నవరత్నాల పథకాలతో కలిగే లబ్ధిని రెట్టింపు చేస్తామనే హామీలు కూడా కూటమి మేనిఫెస్టోలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.

చెప్పిందే చేస్తా, చేసేదే చెబుతానంటూ సీఎం జగన్ మేనిఫెస్టో విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. గతంలో ఇస్తున్న వాటిని కొనసాగించడంతోపాటు మరికొన్నిటిని మాత్రమే ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో చంద్రబాబు మాటలు విని మోసపోవద్దని కూడా సూచించారు. 2014లో హామీ ఇచ్చినట్టుగా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు రుణమాఫీ చేయలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, జిల్లాకో హైటెక్ సిటీ ఏర్పాటు చేయలేదని.. ఈసారి కూడా అలాంటి గారడీలతోనే ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నారని జగన్ హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు తగ్గట్టుగానే చంద్రబాబు రేపు మేనిఫెస్టో అంటున్నారు. ఆయన మాటల గారడీ ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాలి.

First Published:  29 April 2024 3:07 PM IST
Next Story