Telugu Global
Andhra Pradesh

లూథ్రా ట్వీట్‌కు అర్థ‌మిదేనా?

స్కామ్‌లో చంద్రబాబు పూర్తిగా కూరుకుపోయినట్లు, బయటపడే అవకాశాలు లేవని లూథ్రాకు అర్థ‌మైనట్లుంది. అందుకనే పరోక్షంగా బయట ఉన్న‌ జనాలను రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ సృష్టించాలని టీడీపీకి సలహా ఇచ్చినట్లున్నారు.

లూథ్రా ట్వీట్‌కు అర్థ‌మిదేనా?
X

ప్రముఖ లాయర్ సిద్దార్థ‌ లూథ్రా ట్వీట్‌లో చెప్పినట్లే తెలుగుదేశం పార్టీ నడుచుకుంటోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ లూథ్రా ఏమి ట్వీట్ చేశారంటే ‘అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు..ఇక న్యాయం కనుచూపుమేరలో లేదని తెలిసినప్పుడు..కత్తి తీసి పోరాటం చేయటమే సరైన మార్గమని’ అప్పుడెప్పుడో గురుగోవింద్ చెప్పిన విషయాన్ని ఇప్పుడు లూథ్రా ప్రస్తావించారు. లూథ్రా ఏ అర్థంతో ఆ ట్వీట్ చేశారో తెలియ‌క‌ చాలామంది గందరగోళపడుతున్నారు.

అయితే టీడీపీ నేతలు మాత్రం వివిధ వర్గాలవాళ్ళని రెచ్చగొట్టి రోడ్ల మీదకు దింపేశారు. చంద్రబాబు అరెస్టు, రిమాండుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చారు. వెంటనే చంద్రబాబు మీదున్న కేసులను కొట్టేయాలని, రిలీజ్ చేయాలంటు భారీ ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలు కూడా కంపెనీలవారీగా ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీ ఉద్యోగులతో ప్రదర్శనలు చేయించారు. వీళ్ళందరితో టీడీపీ మాట్లాడి మరీ ప్రదర్శనలను ఆర్గనైజ్ చేసినట్లు అర్థ‌మవుతోంది.

హైటెక్ సిటి, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, అమీర్‌పేట, చాంద్రాయణగుట్ట, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు విడతలవారీగా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేశారు. ఐటీ ఫీల్డ్‌లో తామిప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే అదంతా చంద్రబాబు చలవే అంటు పెద్దగా నినాదాలు చేసుకుంటు ఐటీ ఉద్యోగులు ఫ్ల‌కార్డులు కూడా ప్రదర్శించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్‌లో చంద్రబాబు పాత్రపై సాక్ష్యాలు, సాంకేతిక కారణాలతో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. చంద్రబాబుకు మద్దతుగా లూథ్రా చేసిన వాదనలన్నీ వీగిపోయాయి. దాంతో చంద్రబాబుకు రిమాండ్ తప్పలేదు.

దాన్ని తట్టుకోలేకపోతున్న టీడీపీ నేతలు వరుసగా వివిధ రంగాల్లోని వాళ్ళని రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకొస్తున్నట్లు అనుమానంగా ఉంది. లేకపోతే ఐటీ రంగాన్ని డెవలప్ చేయటానికి, అవినీతికి పాల్పడి అరెస్టవ్వటానికి ఏమన్నా సంబంధముందా? ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తే ఎంత అవినీతికైనా పాల్పడవచ్చా? ఎవరు ప్రశ్నించకూడదన్నట్లుగా ఉంది వీళ్ళ వ్యవహారం. స్కామ్‌లో చంద్రబాబు పూర్తిగా కూరుకుపోయినట్లు, బయటపడే అవకాశాలు లేవని లూథ్రాకు అర్థ‌మైనట్లుంది. అందుకనే పరోక్షంగా బయట ఉన్న‌ జనాలను రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ సృష్టించాలని లూథ్రా టీడీపీకి సలహా ఇచ్చినట్లున్నారు. దాంతో లూథ్రా ట్వీట్‌కు అర్థం ఇదేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  14 Sept 2023 5:28 AM GMT
Next Story