Telugu Global
Andhra Pradesh

తోకలు కత్తిరిస్తానన్న బాబుకి గుండుగీసి సున్నం రాశాం.. అదీ బీసీ దెబ్బ

యాదవుడైన శ్రీకృష్ణుడు బీసీ, బోయ కులంలో పుట్టిన వాల్మీకి బీసీ, జాలరి అయిన గుహుడు బీసీ, గంగాపుత్రుడైన భీష్ముడు కూడా బీసీ.. ఇలా పురాణ పురుషుల్లో ఎంతోమంది బీసీ యోధులు ఉన్నారని చెప్పారు తమ్మినేని.

తోకలు కత్తిరిస్తానన్న బాబుకి గుండుగీసి సున్నం రాశాం.. అదీ బీసీ దెబ్బ
X

జయహో బీసీ సభలో.. వైసీపీ తరపున బీసీ నేతలు అదిరిపోయే స్పీచ్ లు ఇస్తున్నారు. బీసీలకు ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అనే విషయాలకే పరిమితం అవుతామని చెప్పినా.. అన్యాపదేశంగా చంద్రబాబు ప్రస్తావన వచ్చేసింది. చంద్రబాబు బీసీ ద్రోహి అంటూ మండిపడ్డారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. చంద్రబాబు బీసీలకు తోకలు కత్తిరిస్తామని వెటకారం చేశారని, చివరకు ఆయన పిలక కత్తిరించి చేతులో పెట్టామని, గుండు గీసి సున్నం రాశామని, చిత్తు చిత్తుగా ఓడించామని, బీసీ దెబ్బ రుచి చూపించామన్నారు తమ్మినేని.

అంతా బీసీలే..

యాదవుడైన శ్రీకృష్ణుడు బీసీ, బోయ కులంలో పుట్టిన వాల్మీకి బీసీ, జాలరి అయిన గుహుడు బీసీ, గంగాపుత్రుడైన భీష్ముడు కూడా బీసీ.. ఇలా పురాణ పురుషుల్లో ఎంతోమంది బీసీ యోధులు ఉన్నారని చెప్పారు తమ్మినేని. చరిత్ర తెలియని వాళ్ళు మా తోకలు కత్తిరిస్తారా? బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారా? అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి నాలిక చీలిక అవుతుందని హెచ్చరించారు. ఐదేళ్లలో బీసీలకు చంద్రబాబు ఏం చేశారు, ఎంత చేశారనే విషయంపై టీడీపీ నుంచి ఎవరైనా చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు తమ్మినేని.

పట్టాభిషేకం చేయాల్సిందే..

ఏపీలో జగన్ హయాంలో అవినీతి చేతులు నరికేశారని అన్నారు తమ్మినేని. లబ్దిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం వార్ జోన్‌ లో అడుగు పెట్టామని, ఈ యుద్ధంలో గెలిచి వైఎస్‌ జగన్‌కు మళ్లీ పట్టాభిషేకం చేయాల్సిన బాధ్యత మనపై ఉందంటూ బీసీ నాయకులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు చరిత్ర తిరగరాస్తారన్నారు. బీసీలంతా సమైక్యంగా ఉండి జగన్ కు అండగా నిలబడాలని చెప్పారు. పొరపాటు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదని హెచ్చరించారు. పేద వాడిగా పుట్టడం తప్పుకాదని, కానీ పేదరికంలో చనిపోకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారని గుర్తుచేశారు తమ్మినేని సీతారాం.

First Published:  7 Dec 2022 12:33 PM IST
Next Story