ఇక కత్తి పట్టడమే కరెక్ట్.. సిద్దార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్
చంద్రబాబు అరెస్టు అయిన దగ్గర నుంచి ట్వీట్లు చేస్తున్న సిద్దార్థ లూథ్రా.. తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత తెలుగు ప్రజలకు బాగా పరిచయం అయిన పేరు సిద్దార్థ్ లూథ్రా. ఢిల్లీలో పేరుమోసిన లాయర్ సిద్దార్థ.. రోజుకు కోటి రూపాయలకు పైగానే తీసుకుంటాడనే వార్తలు వచ్చాయి. లూథ్రా రావడంతో ఇక చంద్రబాబు బయటకు రావడం ఖాయమని తెలుగుదేశం శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కానీ అంతటి పేరు మోసిన లాయర్ కూడా చంద్రబాబు రిమాండ్‌ను తప్పించలేక పోయారు.
చంద్రబాబు అరెస్టు అయిన దగ్గర నుంచి ట్వీట్లు చేస్తున్న సిద్దార్థ లూథ్రా.. తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 'అందరూ అలసి పోయిన తర్వాత, కనుచూపు మేరలో న్యాయం అనేది కనిపించకపోతే.. కత్తి పట్టడమే సరైనది. ఇక పోరాటం చేయడమే సరైన చర్య' అంటూ ట్వీట్ చేశారు. ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌కు గురుగోబింద్ సింగ్ చెప్పిన మాటలు. వాటినే ఇప్పుడు సిద్దార్థ లూథ్రా ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతటి గొప్ప లాయర్ చివరకు కత్తి పట్టమని సలహా ఇస్తూ ట్వీట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కత్తి పట్టమని మీరు లాయర్ అయి ఉండి సలహా ఇస్తున్నారా అని ఒకరు ప్రశ్నించగా.. నాకు 'లా' నే ఆయుధం అంటూ సమాధానం ఇచ్చారు. అంటే ఇన్ని రోజులు లాను ఉపయోగించలేదా అంటూ కొంత మంది వ్యంగ్యంగా రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి అంతటి గొప్ప లాయర్ ఏమీ చేయలేక ఇలా సూచనలు చేస్తున్నాడా అనే డౌట్లు కూడా వస్తున్నాయి.
చంద్రబాబును కలిసిన సిద్దార్థ..
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబును సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ లూథ్రా కలిశారు. ములాఖత్‌లో లాయర్‌గా అధికారులు అవకాశం ఇవ్వడంతో ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి చేరుకొని సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఏసీబీ కోర్టు, ఏపీ కోర్టులో ఆయన చంద్రబాబు తరపున వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు కోర్టులో జరిగిన పరిణామాలు, తదుపరి కార్యచరణను చంద్రబాబుకు లూథ్రా వివరించినట్లు తెలుస్తున్నది.