Telugu Global
Andhra Pradesh

పుస్తకాలు ప్రింట్ చేసే లోపు సిలబస్ మారిపోయింది..

వచ్చే ఏడాది 9వ తరగతి నుంచి సిలబస్ మారుతుంది. దీంతో దాదాపుగా 35 లక్షల పుస్తకాలు చిత్తుకాగితాల్లా మారిపోవాల్సిన పరిస్థితి.

పుస్తకాలు ప్రింట్ చేసే లోపు సిలబస్ మారిపోయింది..
X

ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు కూడా రెండేళ్లుగా ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తోంది. గతేడాది ప్రవైట్ స్కూల్స్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఈ విద్యాసంవత్సరంలో తప్పనిసరిగా వారితో పుస్తకాలు కొనిపించారు. పుస్తకాలకు ఆర్డర్ పెట్టారు కానీ కేలండర్ మారే వరకు అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. తీరా సంక్రాంతికి అవి రెడీ అయ్యాయి తీసుకెళ్లండి అంటూ సమాచారం పంపించినా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం పూర్తవుతుండగా ఇప్పుడు కొత్త పుస్తకాలు కొనుక్కుని విద్యార్థులు ఏం చేసుకోవాలి. వాటన్నిటికీ ముందుగానే డబ్బు చెల్లించిన యాజమాన్యాలు ఏంచేయాలి. పోనీ వచ్చే సంవత్సరానికి పనికొస్తాయా అంటే అదీ లేదు. వచ్చే ఏడాది 9వ తరగతి నుంచి సిలబస్ మారుతుంది. దీంతో దాదాపుగా 35 లక్షల పుస్తకాలు చిత్తుకాగితాల్లా మారిపోవాల్సిన పరిస్థితి.

ముందుచూపు లేకనే..

ప్రతి ఏడాది తరగతులు మొదలయ్యే సమయానికి పుస్తకాలు అందుబాటులో ఉంచితే విద్యార్థులకు వాటివల్ల పూర్తి స్థాయి ఉపయోగం ఉంటుంది. కానీ పుస్తకాల ముద్రణ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు అధికారులు. ప్రైవేట్ స్కూల్స్ వద్ద ఇండెంట్లు పెట్టించుకున్నా సకాలంలో ముద్రణ పూర్తి చేసి ఇవ్వలేకపోయారు. దీంతో వారంతా ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు.

2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 44,39,104 మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది కూడా అదే లెక్కతో పుస్తకాలు ముద్రించారు. కానీ 2022-23 నాటికి 3.98 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడంతో ఆ ఉచిత పుస్తకాలు వృథాగా మారాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ మారిపోతుంది. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన పుస్తకాలను చిత్తుగా వేలంలో విక్రయించుకోవడం మినహా మరో దారి లేకుండాపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యానికి ఎవరిపై కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ప్రజా ధనం వృధా అయిందని ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అవుతుంది, అందుకే ఎవరిపైనా వేటు వేయలేదని అంటున్నారు.

First Published:  13 Jan 2023 3:25 AM GMT
Next Story