రిజర్వు ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు.. - ఆమెతో పాటు మరో నలుగురు నిందితులకు రిమాండ్
స్పెషల్ బెటాలియన్-2లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీను ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అతనికి సూరిబాబుతో ఉన్న పరిచయం నేపథ్యంలోనే అతను ఈ వ్యవహారంలో ప్రధానంగా వ్యవహరించినట్టు సమాచారం.
విశాఖపట్నంలో నోట్ల మార్పిడి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన రిజర్వు ఇన్‌స్పెక్టర్‌పై వేటు పడింది. ఆమెను సస్పెండ్ చేసినట్టు పోలీసు శాఖ తెలిపింది. ఆమెతో పాటు ఏఆర్ కానిస్టేబుల్ ఎం.హేమసుందర్‌ను కూడా సస్పెండ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో రిజర్వు ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత, ఏఆర్ కానిస్టేబుల్ ఎం.హేమసుందర్, హోం గార్డు వి.శ్రీను, మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబులకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. నిందితులను శనివారం విశాఖపట్నంలోని సెంట్రల్ జైలుకు తరలించారు. స్వర్ణలతను సాధారణ మహిళా ఖైదీలతో పాటు బ్యారెక్‌లో ఉంచారు. ఈ కేసులో ఏ4గా ఉన్న స్వర్ణలత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానున్నట్టు సమాచారం.
స్పెషల్ బెటాలియన్-2లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీను ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అతనికి సూరిబాబుతో ఉన్న పరిచయం నేపథ్యంలోనే అతను ఈ వ్యవహారంలో ప్రధానంగా వ్యవహరించినట్టు సమాచారం. గతంలో గాజువాక, టూటౌన్ స్టేషన్లలో పనిచేసిన సమయంలో శ్రీనుపై పలు ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హోం గార్డుల ఆర్ఎస్ఐగా ఉన్న స్వర్ణలతను మంచి చేసుకుని విధులకు సరిగా హాజరుకాకపోవటాన్ని అధికారులు గుర్తించారు. ఆరిలోవకు చెందిన సూరిబాబు జనసేనకు చెందిన ఒక నేతకు అనుచరుడిగా వ్యవహరిస్తున్నట్లు.. ఆ నాయకుడు తీస్తున్న సినిమాలో స్వర్ణలత నటించేలా చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారితో సూరిబాబు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నట్టు తెలిసింది.