Telugu Global
Andhra Pradesh

పోలవరంపై మరో పేచీ.. నిధులే కాదు, అనుమతులు కూడా..

వీటన్నిటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం..కేంద్ర జలశక్తి శాఖ, పర్యావరణ శాఖ.. భాగస్వామ్య రాష్ట్రాలన్నిటితో చర్చించాలని సూచించింది. భాగస్వామ్య పక్షాల తొలి సమావేశం ఈనెలలోనే ప్రారంభం కావాలని ఆదేశించింది.

పోలవరంపై మరో పేచీ.. నిధులే కాదు, అనుమతులు కూడా..
X

ఇన్నాళ్లూ పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి కేంద్రం నిధులు విడుదల చేయడమే ప్రధాన కారణం అనుకున్నారు. ఏడాదికోసారి వచ్చే వరదనీరు, ఇటీవల కరోనా కూడా పరోక్ష కారణాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్త మెలిక పడుతోంది. పోలవరం పర్యావరణ అనుమతుల విషయంలో పునరాలోచించాలని, వాటిని తిరిగి సమీక్ష చేయాలని, తమ ప్రాంతాలు మునిగిపోతాయని తెలంగాణ, ఒడిశా, చత్తీస్ ఘడ్ లేవనెత్తిన అభ్యంతరాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై దీనికి పరిష్కారం కనుగొనాలని సూచించింది సుప్రీం. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని చెప్పింది.

పర్యావరణ అనుమతులపై ఇతర రాష్ట్రాలు లేవనెత్తిన అనుమానాల పిటిషన్లు సుప్రీంలో ఉన్నా కూడా సానుకూల తీర్పు వస్తుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ పనుల్లో ముందుకే వెళ్తోంది. అయితే ఇటీవల గోదావరి భారీ వరదలతో భద్రాచలం వద్ద భారీగా పెరిగిన నీటిమట్టం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో భయాందోళనలకు కారణమైంది. ప్రాజెక్ట్ పూర్తి కాకముందే ఈ స్థాయిలో వరదనీరు భద్రాచలం వద్ద ఉంటే, పూర్తయితే అపార నష్టం కలిగే అవకాశముందని తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. అటు ఒడిశా, చత్తీస్ ఘడ్ నేతలు కూడా పోలవరం వల్ల తమ రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలు కూడా ముంపుబారిన పడతాయని చెబుతున్నారు. గతంలో ఒడిశా ప్రభుత్వం పర్యావరణ అనుమతులపై మరో పిటిషన్ దాఖలు చేసింది. వీటన్నిటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం..కేంద్ర జలశక్తి శాఖ, పర్యావరణ శాఖ.. భాగస్వామ్య రాష్ట్రాలన్నిటితో చర్చించాలని సూచించింది. భాగస్వామ్య పక్షాల తొలి సమావేశం ఈనెలలోనే ప్రారంభం కావాలని ఆదేశించింది.

ఒడిశా వాదన ఇదీ..

36లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి స్థాయి నుంచి 50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి స్థాయికి ప్రాజెక్టును విస్తరిస్తున్నారని, దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ఒడిశా వాదిస్తోంది. ప్రాజెక్టులో విస్తృతమైన మార్పులు చేసినప్పుడు మళ్లీ పర్యావరణ అనుమతులు పొందాలని, ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది.

తెలంగాణ ఏమందంటే..?

ఒడిశాలాగా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపివేయాలని తాము కోరడం లేదని, ముంపు సమస్యను పరిష్కరించేంతవరకూ ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయొద్దని కోరుతున్నామని తెలంగాణ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన వరదలకు భద్రాచలం ఆలయం పూర్తిగా మునిగిపోయిందని, నీరు నిలబెట్టడానికి ముందే చుట్టుపక్కల రాష్ట్రాల్లో తలెత్తే ముంపు గురించి, పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయాలని సూచించారు. రిజర్వాయరు నిర్మాణ పరిధిని 150 అడుగుల నుంచి 177 అడుగులకు పెంచడంతో బ్యాక్‌ వాటర్‌ ముంపు పెరుగుతోందని పేర్కొన్నారు.

ఏపీవాదన..

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి రూ.20వేల కోట్లు ఖర్చయ్యాయని, ఇంకా రూ.30వేల కోట్లు ఖర్చు చేయాలని ఏపీ తరపు న్యాయవాది వివరించారు. ఇది కేంద్ర నిధులతో నిర్మిస్తున్న ప్రాజెక్టు అని, ఏపీ చేపడుతున్నది కాదని అన్నారు. వివాదాస్పద అంశాల పరిష్కారానికి రాష్ట్రాల సీఎస్‌ లతో కేంద్రం ఓ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు.

అటు కొర్రీలు, ఇటు కోర్టు కేసులు..

పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికే ఆలస్యమైందనే విషయం తెలిసిందే. వైసీపీ వచ్చాక డెడ్ లైన్ పెట్టి మరీ పూర్తి చేస్తామన్నా కుదర్లేదు. కరోనా కాలంలో కాంట్రాక్ట్ సంస్థ స్పీడ్ అందుకున్నా.. పరిస్థితులు సహకరించలేదు. పెరిగిన అంచనా వ్యయంపై కేంద్రం పదే పదే కొర్రీలు వేస్తూ కాలం వెళ్లదీస్తోంది. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఏపీ ప్రభుత్వానికి ఇదే ప్రధాన అభ్యర్థన అవుతోంది. ఈ దశలో ఇప్పుడు కోర్టు కేసులు కూడా పోలవరానికి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రాలన్నిటితో కలిపి కేంద్రం చర్చలు మొదలు పెట్టి, సమస్యకు పరిష్కారం లభించాలంటే మాత్రం పోలవరం మరింత ఆలస్యం అవడం ఖాయం.

First Published:  7 Sept 2022 7:07 AM IST
Next Story