Telugu Global
Andhra Pradesh

లూథ్రా వల్ల కూడా కాలేదా?

సిద్దార్థ‌ లూథ్రా లేవనెత్తిన అభ్యంతరాలు నిలిచేవి కావని కోర్టు బయట ఇతర లాయర్లే చెప్పేశారు. లూథ్రా ఇలాగే వాదిస్తే చంద్రబాబుకు రిమాండ్ ఖాయమని కోర్టు బయట మిగిలిన న్యాయవాదులు ముందే చెప్పేశారు.

లూథ్రా వల్ల కూడా కాలేదా?
X

చివరకు సిద్దార్థ‌ లూథ్రా వల్ల కూడా కాలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబునాయుడును ఏసీబీ అరెస్టు చేయటం ఆలస్యం వెంటనే ఢిల్లీ నుండి లూథ్రా విజయవాడలో దిగేశారు. తన మంది మార్బలంతో అట్టహాసంగా లూథ్రా దిగటంతో టీడీపీ నేతలు, చంద్రబాబు మద్దతుదారులంతా హ్యాపీగా ఫీలైపోయారు. ఇంకేముంది లూథ్రా దిగేశారు కాబట్టి చంద్రబాబు బెయిల్ పైన బయటకు వచ్చేయటం ఖాయమన్నట్లుగా మాట్లాడారు. స్కామ్‌లో సూత్రధారి, కీలక పాత్రధారి, కుట్రదారుడు చంద్రబాబే అని ఏసీబీ తరపున అడిషినల్ అడ్వకేజ్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.

చంద్రబాబు అరెస్టు అక్రమమని, ఏసీబీ పెట్టిన సెక్షన్లు వర్తించవని, చంద్రబాబు అరెస్టులో ఏసీబీ ప్రొసీజర్ ఫాలో అవలేదని లూథ్రా పదేపదే వాదించారు. మొత్తానికి రెండు వైపుల వాదనలు సుమారు 8 గంటలపాటు జరిగింది. మధ్యాహ్నం 2.45 గంటలకు వాదనలు ముగిస్తే సాయంత్రం 6.45 గంటలకు న్యాయమూర్తి చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో చంద్రబాబు మద్దతుదారులు, టీడీపీ నేతలు, లూథ్రా క్యాంపు మొత్తం షాక్‌కు గురైంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే లూథ్రా వాదనల్లోని డొల్లతనం అంతా వాదనల్లో బయటపడింది. అసలు దేశంలోనే ఎంతో పేరున్న లాయర్లలో ఒకళ్ళైన లూథ్రా లేవనెత్తిన అభ్యంతరాలు ఇవేనా అని ఆశ్చర్యమేసింది. లూథ్రా వాదించిన పాయింట్లు ఏవంటే గవర్నర్‌కు చెప్పకుండానే అరెస్టు చేశారని, అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టలేదని, సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించవని, నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేశారని, స్కామ్‌తో చంద్రబాబుకు అసలు సంబంధమే లేదని పదేపదే వాదించారు. ఇంతోటి వాదనలు వినిపించటానికి లూథ్రా ఢిల్లీ నుండి రావాలా అని అనిపించింది.

ఎందుకంటే లూథ్రా లేవనెత్తిన అభ్యంతరాలు నిలిచేవి కావని కోర్టు బయట ఇతర లాయర్లే చెప్పేశారు. లూథ్రా ఇలాగే వాదిస్తే చంద్రబాబుకు రిమాండ్ ఖాయమని కోర్టు బయట మిగిలిన న్యాయవాదులు ముందే చెప్పేశారు. వాళ్ళు చెప్పినట్లుగానే లూథ్రా వాదనలన్నింటినీ జడ్జి కొట్టేశారు. చంద్రబాబును అరెస్టు విషయాన్ని గవర్నర్‌కు చెప్పాల్సిన అవసరంలేదన్నారు. జరిగిన నేర తీవ్రత కారణంగా సెక్షన్ 409 పెట్టడం సబబే అన్నారు. అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో ఏసీబీ చంద్రబాబును ప్రవేశపెట్టారని న్యాయమూర్తి అంగీకరించారు. నేర తీవ్రతను బట్టి చంద్రబాబును అరెస్టు చేయటానికి ముందుగా నోటీసు ఇవ్వాల్సిన అవసరమే లేదని జడ్జి తేల్చేసి 14 రోజుల రిమాండు విధించారు. ఇదంతా చూసిన తర్వాత లూథ్రా వాదనల్లో ఎలాంటి పసలేదని అర్థ‌మైపోయింది.


First Published:  11 Sept 2023 10:15 AM IST
Next Story