ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు.. రూ. 243 కోట్ల పరిహారం చెల్లించాల్సిందే
పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, చింతలపూడి ప్రాజెక్టులకు సంబంధించి అనేక ఉల్లంఘనటు జరిగాయని పేర్కొన్నది. ఇందుకు గాను రూ. 243 కోట్ల పెనాల్టీ విధించింది.
పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన రూ. 243 కోట్ల పరిహారాన్ని తప్పకుండా చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్జీటీ గత డిసెంబర్‌లో ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎన్జీటీ ఆదేశాలను యధాతథంగా అమలు చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరిహారానికి సంబంధించిన విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపడతామని.. అప్పటిలోగా ఎన్జీటీ తీర్పులోని మిగిలిన అంశాలను అమలు చేయాలని సూచించింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం పర్యావరణ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని ఎన్జీటీ గత ఏడాది డిసెంబర్ 2న తేల్చింది. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, చింతలపూడి ప్రాజెక్టులకు సంబంధించి అనేక ఉల్లంఘనటు జరిగాయని పేర్కొన్నది. ఇందుకు గాను రూ. 243 కోట్ల పెనాల్టీ విధించింది. అంతే కాకుండా ఉల్లంఘనలను వెంటనే సరి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. పోలవరంతో పాటు పట్టి సీమకు రూ. 1.90 కోట్లు, పురుషోత్తమపట్నంకు రూ. 2.48 కోట్ల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఎన్టీజీ తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఇచ్చిన తీర్పును, పెనాల్టీని కొట్టి వేయాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్జీటీ సిఫార్సులను అమలు చేయాల్సిందేనని ఆదేశించింది. పర్యావరణానికి జరిగిన నష్టంపై సంయుక్త కమిటి సిఫారసు చేసిన జరిమానాను వెంటనే జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన నోటీసులను ప్రతివాదులకు జారీ చేసింది.