ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ పై ఉన్న సీబీఐ కేసుల విషయంలో కదలిక రావడం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో జగన్ ని ఇబ్బంది పెడుతోంది ఒకరే కావడం విశేషం.
ఏపీ ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ లో నిన్న హైకోర్టు సీఎం జగన్ సహా మొత్తం 41మందికి నోటీసులు జారీ చేసింది. ఈ రోజు అదే రఘురామ కృష్ణంరాజు వేసిన మరో పిటిషన్ లో సుప్రీంకోర్టు, సీఎం జగన్ కి నోటీసులు జారీ చేయడం విశేషం. సీబీఐ కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. సీఎం జగన్, సీబీఐ సహా ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.
చంద్రబాబుపై స్కిల్ కేసు, అరెస్ట్, జైలు.. తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. చంద్రబాబుపై సీఐడీ వరుస కేసులు నమోదు చేస్తుండగా.. ఇటు సీబీఐ కేసుల వ్యవహారంలో జగన్ ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ కేసులతో సంబంధం లేకపోయినా ఎంపీ రఘురామ కోర్టులకెక్కారు. ఇటు హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో వరుసగా పిటిషన్లు వేస్తూ సీఎం జగన్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.
జగన్ తప్పు చేశారా, ఆయనను అన్యాయంగా ఆ కేసుల్లో ఇరికించారా అనేది వేరే విషయం. సీబీఐ ఎంక్వయిరీ మాత్రం ఓ మూలనపడిందనేది వాస్తవం. ఆ మాటకొస్తే సీబీఐ విచారణ చేపట్టే కేసులు ఏవయినా.. ఒక్కో సీజన్ లో ఎక్కడాలేని హడావిడి ఉంటుంది, ఒక్కో టైమ్ లో అసలు ఆ కేసు విచారణ స్టేజ్ లో ఉందా..? అన్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం జగన్ కేసుల వ్యవహారం కూడా ఇదే స్టేజ్ లో ఉంది. ఇన్నాళ్లూ జగన్ బెయిల్ పై ఉన్నారని టీడీపీ నేతలు కామెంట్లు చేసేవారు, ఇటీవల చంద్రబాబు కూడా సీఐడీ కేసుల్లో ఇరుక్కునే సరికి వారికి ఆ ఛాన్స్ మిస్సయింది. ఎవరికి వారు మాపై పెట్టినవి అక్రమ కేసులు, మా విషయంలో జరిగినవి కక్షసాధింపు చర్యలు అని చెప్పుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఎన్నికల ఏడాదిలో సీఎం జగన్ పై ఉన్న సీబీఐ కేసుల విషయంలో కదలిక రావడం మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో జగన్ ని ఇబ్బంది పెడుతోంది ఒకరే కావడం విశేషం.