చంద్రబాబుకి షాక్.. 'సిట్' కి సుప్రీం ఓకే
సుప్రీంకోర్టు 'సిట్'కి ఓకే చెప్పడంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కొత్తగా 'సిట్' విచారణతో చంద్రబాబుకి తిప్పలు తప్పవని తేలిపోయింది.
టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. సిట్ విచారణపై హైకోర్టు విధించిన స్టేని ఎత్తివేసింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. హైకోర్టు స్టేని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. ఇప్పటికే వాదనలు విన్న జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ రోజు తీర్పు చెప్పింది.
టీడీపీ ప్రభుత్వం అవినీతిపై విచారణ జరిపిస్తామంటూ ఆమధ్య వైసీపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమించింది. అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తర్వాత వచ్చిన ప్రభుత్వం కక్షసాధింపుతో ఇలా విచారణ జరపడం సరికాదంటూ టీడీపీ, ఏపీ హైకోర్టుని ఆశ్రయించింది. 'సిట్' విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడంతో టీడీపీకి ఊరట లభించింది. దీన్ని వైసీపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తాజాగా తీర్పునిచ్చింది. దీంతో చంద్రబాబుకి షాక్ తగిలినట్టయింది.
వాట్ నెక్ట్స్..?
సుప్రీంకోర్టు 'సిట్'కి ఓకే చెప్పడంతో ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కొత్తగా 'సిట్' విచారణతో చంద్రబాబుకి తిప్పలు తప్పవని తేలిపోయింది. అవినీతి ఆరోపణలు చేస్తున్నారే కానీ, కోర్టులో నిరూపించలేకపోతున్నారంటూ ఇన్నిరోజులు చంద్రబాబు, టీడీపీ నేతలు.. వైసీపీపై విరుచుకుపడేవారు. ఇప్పుడు 'సిట్' రంగంలోకి దిగితే చంద్రబాబు భవిష్యత్ ఏంటో తేలిపోతుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం, భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. వీటన్నిటిపై 'సిట్' విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.