Telugu Global
Andhra Pradesh

ఒక కేసులో ఇంత మంది లాయర్లా? - సుప్రీం ఆగ్రహం

ధర్మాసనం అసలెంత మంది లాయర్లను నియమించారని ప్రశ్నించింది. తొలుత అభిషేక్ సింఘ్వి వాదిస్తారన్నారు..ఇప్పుడు ఈయన అంటున్నారు. మీరు ఉన్నారు.. ఇలా ఎక్కువ మంది లాయర్లు ఉంటే కేసులో కోర్టు ప్రభావితం అవుతుందని భావిస్తున్నారా అని అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఒక కేసులో ఇంత మంది లాయర్లా? - సుప్రీం ఆగ్రహం
X

ఏపీ ప్రభుత్వం తరఫున ఒక కేసులో హాజరైన లాయర్ల సంఖ్యపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఒక కేసు వాదించేందుకు ఇంతమంది లాయర్లా అని ప్రశ్నించింది. ఇలా ఎక్కువ మంది లాయర్లను పెట్టుకుంటే కోర్టు ప్రభావితమవుతుందని భావిస్తున్నారా అని వ్యాఖ్యానించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పర్యావరణ ఉల్లంఘన‌లు జరిగాయని అందుకే 120 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలంటూ ఎన్జీటీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

ఈ కేసులో ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి హాజరుకావాల్సి ఉండగా.. సుప్రీంకోర్టులోనే మరో బెంచ్ ముందు మరో కేసులో ఆయన బిజీగా ఉన్నారని.. కాబట్టి కొంత సమయం తర్వాత కేసును విచారించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. అందుకు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సిటీ రవికుమార్‌ల ధర్మాసనం నిరాకరించింది.

అసలు కేసు ప్రాథమిక అంశాలేంటో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఎన్టీటీ ఇచ్చిన తీర్పుపై తమకు అభ్యంతరాలున్నాయని న్యాయవాది వివరించారు. ఇంతలోనే మరో సీనియర్ న్యాయవాది వెంకటరమణి రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన వాదనలు వినిపిస్తారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

దాంతో ధర్మాసనం అసలెంత మంది లాయర్లను నియమించారని ప్రశ్నించింది. తొలుత అభిషేక్ సింఘ్వి వాదిస్తారన్నారు..ఇప్పుడు ఈయన అంటున్నారు. మీరు ఉన్నారు.. ఇలా ఎక్కువ మంది లాయర్లు ఉంటే కేసులో కోర్టు ప్రభావితం అవుతుందని భావిస్తున్నారా అని అసంతృప్తి వ్యక్తం చేసింది. లాయర్ల నియామ‌కంపై పెట్టే శ్రద్ధ పర్యావరణ పరిరక్షణపై పెట్టాలని వ్యాఖ్యానించింది. అసలు ఈ కేసులో ఎంతమంది లాయర్లను నియమించుకున్నారు.. వారికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది అన్న వివరాలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇంతలో పిటిషనర్‌ పెంటపాటి పుల్లారావు తరపు న్యాయవాది జోక్యం చేసుకుని ఇప్పటి వరకు పోలవరం కేసులో రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని కోర్టుకు వివరించారు.

First Published:  27 Sept 2022 8:38 AM IST
Next Story