ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
అహోబిలం మఠం, దేవాలయం నిర్వహణను, నియంత్రణను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. మఠం నిర్వహణ, ఆలయ నిర్వహణపైన ప్రభుత్వానికి ఎందుకింత ఆసక్తి అంటూ సూటిగా ప్రశ్నించింది.
ప్రభుత్వాలు ఓవర్ యాక్షన్ చేస్తే ముకుతాడు వేయటానికే న్యాయస్ధానాలున్నాయి. ఈ విషయం మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసొచ్చింది. కర్నూలు జిల్లాలోని అహోబిలం మఠం, దేవాలయం నిర్వహణను, నియంత్రణను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. మఠం నిర్వహణ, నియంత్రణలో ప్రభుత్వ జోక్యం ఎందుకంటు ఫుల్లుగా తలంటింది. మఠం నిర్వహణలో కానీ లేదా మఠం ఆధ్వర్యంలో పనిచేస్తున్న దేవాలయం నిర్వహణపైన ప్రభుత్వానికి ఎందుకింత ఆసక్తి అంటూ సూటిగానే ప్రశ్నించింది.
అహోబిలం మఠంతో పాటు దేవాలయానికి ప్రభుత్వం ఆమధ్య ఒక ఈవోని నియమించింది. మఠం+దేవాలయం రెండింటిని తన ఆధీనంలోకి తీసుకోవటమే ప్రభుత్వ ఉద్దేశం. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ హై కోర్టులో కేసు దాఖలైంది. కేసు విచారించిన కోర్టు మఠం, దేవాలయ నిర్వహణను మఠం ధర్మకర్తకే వదిలేయాలని, ప్రభుత్వ జోక్యం వద్దని తీర్పు చెప్పింది. అయితే ప్రభుత్వం ఈ విషయంపై సుప్రీంకోర్టులో చాలెంజ్ చేసింది. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పునే సమర్ధించింది.
మఠం వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టంగా చెప్పేసింది. మఠం, దేవాలయ నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు లేదా అవినీతి జరుగుతున్నట్లు ఆధారాలతో సహా ఆరోపణలు వచ్చినపుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవటంలో తప్పులేదని చెప్పింది. అవకతవకలు, అవినీతి లేనప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమిటంటు నిలదీసింది. మఠం, దేవాలయానికి ఈవోను నియమించే అధికారం ప్రభుత్వానికి లేనపుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదని స్పష్టంగా తేల్చి చెప్పేసింది.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అహోబిలం మఠం, దేవాలయాన్ని ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకోవాలని అనుకున్నప్పుడు, వైజాగ్‌లో శారదా పీఠం, దేవాలయాన్ని కూడా ఆధీనలంలోకి తీసుకోవాలి కదా. శారదా పీఠం వ్యవహారాల్లో జోక్యం చేసుకోని ప్రభుత్వం అహోబిలం మఠం వ్యవహారాల్లోనే ఎందుకు జోక్యం చేసుకున్నది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఏదేమైనా తన పరిధిలో లేని అంశాలపై ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని ప్రభుత్వానికి మరోసారి తెలిసివచ్చింది.