చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
చంద్రబాబు నాయుడిపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
చంద్రబాబు నాయుడిపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 2005లోనే చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. 1987 నుంచి 2005 మధ్య చంద్రబాబు ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని, అందుకు ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్టే నిదర్శనం అంటూ ఆమె కేసు వేశారు.
ఆ వెంటనే చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్లి ఏసీబీ కోర్టు విచారణపై స్టే తెచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టే మీద ఉన్న కేసుపై ఏసీబీ కోర్టు గతంలో విచారణ ప్రారంభించింది. లక్ష్మీపార్వతి పిటిషన్‌ను విచారించిన ఏసీబీ కోర్టు గతేడాది ఆ పిటిషన్‌ను కొట్టివేశారు.
ఆ తర్వాత హైకోర్టులో కూడా లక్ష్మీపార్వతి ఊరట లభించలేదు. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. అసలు చంద్రబాబు ఆస్తులతో మీకేం పని అని కోర్టు ప్రశ్నించింది. ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటని ఆమెను ప్రశ్నించింది.
తాను ఎన్టీఆర్ సతీమణిని అని, చంద్రబాబు ఆస్తులు పెరిగి తీరు తనకు తెలుసని కోర్టుకు వివరించారు. అయినా లక్ష్మీ పార్వతి వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఒకరి ఆస్తులు మరొకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదని, అలాంటి అవసరం ఏమైనా ఉంటే ప్రభుత్వాలు చూసుకుంటాయి అంటూ సుప్రీంకోర్టు లక్ష్మీపార్వతి పిటిషన్‌ను కొట్టివేసింది.