అవినాష్ రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈనెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డి పిటిషన్‌ను విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

అవినాష్ రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించారు. అయితే అవినాష్ రెడ్డి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. హైకోర్టులో పిటిషన్ వేసుకునేందుకు మాత్రం అంగీకరించింది.
ఈనెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డి పిటిషన్‌ను విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే హక్కు అవినాష్ రెడ్డికి ఉంటుంది కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేసుకోచ్చని స్పష్టం చేసింది. కానీ అప్పటి వరకు సీబీఐ అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది.
విచారణ సందర్భంగా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి వద్ద వైసీపీ కార్యకర్తలు చేస్తున్న హడావుడిని సునీత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఇటీవల మూడు సార్లు సీబీఐ నోటీసులు ఇచ్చినా అవినాష్ రెడ్డి హాజరు కాని విషయాన్ని కూడా సునీత లాయర్లు న్యాయమూర్తులకు వివరించారు. అరెస్ట్ విషయంలో సీబీఐ తాత్సారం చేస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది.
మొత్తం మీద సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించడంతో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ హైకోర్టుకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు విచారణ వరకు సీబీఐ ఎదురు చూస్తుందేమో చూడాలి.