రుషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోలేం - స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
విచారణలో భాగంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అంటూ ప్రశ్నించింది.
విశాఖపట్నంలోని రుషికొండ నిర్మాణాల అంశంపై తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ నాయకుడు లింగమనేని శివరామప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో లింగమనేనికి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. విచారణలో భాగంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అంటూ ప్రశ్నించింది. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇది రాజకీయ ఫిర్యాదు అంటూ ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మాణాలు చేపట్టడం అక్రమమని, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయరాదని పేర్కొంటూ లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు రుషికొండపై ఎలాంటి నిర్మాణాలూ, కార్యక్రమాలూ చేపట్టొద్దని ఆదేశాలివ్వాలని కోరుతూ లింగమనేని తన పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.
♦