సుప్రీంకోర్టులో బాబుకు చుక్కెదురు
ఏపీ ఫైబర్ నెట్ కేసులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై బహిరంగంగా ఎలాంటి ప్రకటనలూ చేయొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం చంద్రబాబును ఆదేశించింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఇప్పుడే చేయబోమని కోర్టు స్పష్టంచేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఇప్పటికే చంద్రబాబు దాఖలు చేసిన 17ఏ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన అనంతరమే దీనిపై విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు ఈ విచారణను జనవరి 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు మంగళవారం తెలిపింది.
బహిరంగ ప్రకటనలు చేయొద్దు...
ఏపీ ఫైబర్ నెట్ కేసులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై బహిరంగంగా ఎలాంటి ప్రకటనలూ చేయొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం చంద్రబాబును ఆదేశించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేసివుంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని కోరింది.
ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో..
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కుంభకోణానికి పాల్పడ్డారనే అభియోగాలపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతోంది.