Telugu Global
Andhra Pradesh

అన్న బొబ్బిలి కోటలో తమ్ముడు పాగా

2019 ఎన్నికల్లో బొబ్బిలి రాజులు ఇద్దరూ రెండు స్థానాల్లో ఓడిపోయి దారుణ పరాభవం మూటగట్టుకున్నారు. చాలా రోజులు టిడిపికి దూరంగా వుంటూ వచ్చారు. ఒకానొక దశలో మళ్లీ వైసీపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి.

అన్న బొబ్బిలి కోటలో తమ్ముడు పాగా
X

బొబ్బిలి యుద్ధం గురించి తెలియని తెలుగు వారుండరు. పౌరుషాల పోతుగడ్డ, పోరాటాల పురిటిగడ్డ అయిన బొబ్బిలి కోటలో నేటి రాజకీయం రంగు మారుతోంది. బొబ్బిలి రాజ వారసులు ప్రస్తుతం ముచ్చటగా మూడో పార్టీలో తమ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజయ్ కృష్ణ రంగారావు 2004, 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అన్న ఎమ్మెల్యే అయితే తమ్ముడు బేబీ నాయన 2005లో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పదవిలోకి వచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి కొత్త పార్టీ పెట్టుకోగా బొబ్బిలి రాజులు అటువైపు జంప్ కొట్టారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది ముచ్చటగా మూడోసారి గెలిచారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టిడిపిలోకి మారిపోయారు. మంత్రి పదవి పొంది అధికార టిడిపిలో కీలక నేతగా ఎదిగారు.

2019 ఎన్నికల్లో బొబ్బిలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుజయ్ కృష్ణ రంగారావు వైసీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. తమ్ముడు బేబీ నాయన విజయనగరం ఎంపీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో బొబ్బిలి రాజులు ఇద్దరూ రెండు స్థానాల్లో ఓడిపోయి దారుణ పరాభవం మూటగట్టుకున్నారు. చాలా రోజులు టిడిపికి దూరంగా వుంటూ వచ్చారు. ఒకానొక దశలో మళ్లీ వైసీపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి.

అనూహ్యంగా అన్న సుజయ కృష్ణ రంగారావు పోటీచేసిన బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తమ్ముడు బేబీ నాయన యాక్టివ్ అయ్యారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించి బొబ్బిలి అసెంబ్లీకే తన కార్యకలాపాలు పరిమితం చేశారు. అన్న సుజయ్ కృష్ణ రంగారావు పార్టీకి, నియోజకవర్గ ప్రజలతో అంటీముట్టనట్టు ఉంటుండటం బొబ్బిలి కోట రాజకీయ రహస్యం అంతుబట్టటంలేదు. వచ్చే ఎన్నికలకు బొబ్బిలి అసెంబ్లీ నుంచి బేబీ నాయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయం అని తేలిపోయింది. తమ్ముడు తన స్థానాన్ని ఆక్రమించడంతో అన్న వైసీపీ గూటికి వెళతారా..? తమ్ముడి గెలుపు కోసం పనిచేస్తారా..? అనేది చూడాలి.

First Published:  1 Dec 2022 7:00 AM IST
Next Story