రాజీనామాలకు కారణమిదేనా ?
జిల్లాలో తమ మాట చెల్లుబాటు కానపుడు ఇక పదవిలో ఉండటం ఎందుకు, అనవసరమైన ఒత్తిళ్ళను నెత్తికెత్తుకోవటం ఎందుకనే ఆలోచనతోనే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పైగా బాధ్యతలను నిర్వర్తించలేకపోతే తప్పుకోమని స్వయంగా జగనే చెప్పారు.
నాలుగు రోజుల వ్యవధిలో అధికార పార్టీలోని ఇద్దరు జిల్లా అధ్యక్షులు రాజీనామాలు చేశారు. ఎన్నికలు తరుముకొస్తున్న నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి అందరి మీద బాగా ఒత్తిడి పెంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకుని దాని ప్రకారమే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే జనాలకు మంత్రులు, ఎమ్మెల్యేలను దగ్గర చేయటంలో భాగంగానే గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు జిల్లాలో ఎలా అమలవుతోందో చూడాల్సిన బాధ్యత కూడా జిల్లా అధ్యక్షుల మీదే పెట్టారు.
ఈ బాధ్యతలనే జిల్లాల అధ్యక్షులు తట్టుకోలేకపోతున్నట్లుంది. నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత రాజీనామా చేశారు. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి రాజీనామ చేశారు. జగన్‌కు రాసిన రాజీనామా లేఖల్లో తాము ఒత్తిళ్ళను తట్టుకోలేకపోతున్నట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పేరుకు జిల్లాల అధ్యక్షులే అయినా వీళ్ళని లెక్కచేసే వాళ్ళు లేరు. ఎందుకంటే మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు అధ్యక్షుల మాట వినటం కష్టమే.
పైగా తమ నియోజకవర్గాల్లో కార్యక్రమంలో పాల్గొంటూ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని పరుగులు పెట్టించటం జిల్లాల అధ్యక్షుల వల్ల కావటం లేదు. జిల్లాలో తమ మాట చెల్లుబాటు కానపుడు ఇక పదవిలో ఉండటం ఎందుకు, అనవసరమైన ఒత్తిళ్ళను నెత్తికెత్తుకోవటం ఎందుకనే ఆలోచనతోనే వీళ్ళిద్దరు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పైగా బాధ్యతలను నిర్వర్తించలేకపోతే తప్పుకోమని స్వయంగా జగనే చెప్పారు.
దాన్ని అవకాశంగా తీసుకుని వీళ్ళిద్దరు రాజీనామాలు చేశారు. కాకపోతే వ్యక్తిగత కారణాల వల్ల తాము అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నట్లు చెప్పారు. సో జరుగుతున్నది చూస్తుంటే తొందరలోనే ఇంకా చాలామంది ఈ బాధ్యతల నుంచి తప్పుకునేట్లే కనబడుతోంది. బాధ్యతల నుంచి తప్పుకుని పూర్తిగా తమ నియోజకవర్గాలకే పరిమితమవ్వాలని డిసైడ్ అయ్యారు. అధ్యక్షహోదాలో జిల్లాలో తిరగటం వల్ల నష్టమే తప్ప లాభం లేదని వీళ్ళిద్దరికీ అర్ధమైపోయింది. మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన కారణంగా వాళ్ళ నియోజకవర్గాల్లో గ్యాప్ పెరిగిపోతోందట. అందుకనే నాలుగు రోజుల్లో ఇద్దరు రాజీనామాలు చేశారు. ఇంకెంత మంది క్యూలో ఉన్నారో చూడాల్సిందే.