తెలుగుదేశానికి వారసుల సమస్య
వచ్చే ఎన్నికల్లో వారసులకి సీట్లు ఇప్పించుకునే పనిలో సీనియర్ నేతలు తలమునకలై ఉన్నారు. కొందరికీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఇచ్చి, మరికొందరికి తండ్రుల్నే మళ్లీ బరిలో దింపుతారనే ప్రచారం ఉంది.
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. కొన్నిచోట్ల అభ్యర్థుల్నికూడా ప్రకటిస్తోంది. అయితే చాలా చోట్ల సీనియర్ నేతలు తమ రాజకీయ వారసులని ఈ ఎన్నికలకే పరిచయం చేయాలనే ఆశతో ఉండటంతో అధినేతకి వారసుల సమస్యల ఎదురవుతోంది. ఏంటి వారసుల గోల అని అనలేని ఇరకాటంలో చంద్రబాబు ఉన్నారు. తాను తన కొడుకుని టీడీపీ భావిసారధిగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మిగిలిన సీనియర్ నేతలు తమ నియోజకవర్గాలలో తమ పిల్లలకి రాజకీయ వారసత్వం అప్పగించాలనే తహతహలాడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో వారసులకి సీట్లు ఇప్పించుకునే పనిలో సీనియర్ నేతలు తలమునకలై ఉన్నారు. కొందరికీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఇచ్చి, మరికొందరికి తండ్రుల్నే మళ్లీ బరిలో దింపుతారనే ప్రచారం ఉంది. దీనిపై సీనియర్ నేతలు ఆందోళనగా ఉన్నారు. తమ వయసు మీద పడుతుందటం, పిల్లల్ని ఎలాగైనా పాలిటిక్స్‌లో సెటిల్ చేయాలనే తాపత్రయం ఉంది. ఎవరికి కూడా స్పష్టమైన హామీ అధినేత నుంచి దక్కకపోవడంతో చాలామంది సీనియర్ నేతలు ఆందోళనలో ఉన్నారు. దాదాపు 50 మంది వరకూ టీడీపీ నేతలు తమ వారసులని రంగంలోకి దింపాలని ఉవ్విళ్లూరుతున్నారు.
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకి తుని ఇన్చార్జిగా ఇచ్చారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని తనయుడు నాగార్జున చీపురుపల్లి నుంచి బరిలో దిగుతారని ప్రచారం సాగుతోంది. చింతకాయల విజయ్ వారసుల కోటాలో అందరి కంటే ముందు తన సీటుని కన్‌ఫామ్ చేసుకున్నారు. వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా కూడా ఇన్చార్జి పదవి దక్కింది. పదులసంఖ్యలో టీడీపీ సీనియర్ నేతలు తెలుగుదేశం అధినేత వద్ద తమ వారసుల రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు.