బీఆర్‌ఎస్‌ను ఆహ్వానిస్తూ ఏపీలో విద్యార్థి జేఏసీ మీటింగ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాహిత రాజకీయాలు చేస్తుంటే తమ రాష్ట్రంలో చంద్రబాబు, జగన్, పవన్ మాత్రం కుల రాజకీయాలు చేస్తూ బీజేపీ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఇది రాష్ట్రానికే అవమానమని విద్యార్థి నేతలు వ్యాఖ్యానించారు.
ఏపీలో ప్రస్తుత వైసీపీ, గత టీడీపీ పాలనపై సంతృప్తి చెందని వారు కొత్త ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తున్నారు. వారికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ఇప్పుడు అవకాశంగా కనిపిస్తోంది. ఏపీలోని అనేక వర్గాలకు బీఆర్‌ఎస్ పట్ల ఆసక్తి ఉన్నా అటువైపు వెళ్తే తమపై ఉన్న పార్టీలు ఏ తరహా ప్రచారం చేస్తాయో అన్న సంశయంతో కాస్త వెనుకడుగు వేస్తున్నారు. ప్రగతిశీల సంఘాలు, విద్యార్థి సంఘాలు మాత్రం వచ్చే విమర్శలను ఊహించుకుని ఆగిపోవడం లేదు.
ఇప్పటికే పలుచోట్ల ఏపీలో బీఆర్‌ఎస్‌ను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ యూత్ విద్యార్థి సంఘం బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. దేశంలో మతోన్మాద బీజేపీని ఎదుర్కొనే శక్తి ఒక్క బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని.. కాబట్టి ఏపీలోనూ ప్రతి ఒక్కరూ బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు జగదీష్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాహిత రాజకీయాలు చేస్తుంటే తమ రాష్ట్రంలో చంద్రబాబు, జగన్, పవన్ మాత్రం కుల రాజకీయాలు చేస్తూ బీజేపీ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఇది రాష్ట్రానికే అవమానమని విద్యార్థి నేతలు వ్యాఖ్యానించారు. మోడీ పాలనలో దేశంలో అన్ని రంగాల్లో వెనుకబడినా, అన్ని సంస్థలను ప్రైవేట్‌కు అప్పగిస్తున్నా బీజేపీ ప్రభుత్వానికే జగన్‌మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు.
త్వరలోనే తిరుపతి, విశాఖపట్నంలో తాము నిర్వహించబోయే విద్యార్థి సభకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని చెప్పారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏపీలోనూ అవసరమన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీలు చూపిన తెగువలను ఏపీ ఎంపీలు ఎందుకు చూపడం లేదని విద్యార్థి నేతలు ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, మిషన్ భగీరథ, దళిత బంధు పథకాలు ఏపీలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలుగు రాష్ట్రాల్లోని 42 ఎంపీ స్థానాలను బీఆర్ఎస్‌కు గెలిపించి ఇస్తే రెండు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, జగన్ చేస్తున్న కులరాజకీయాల కారణంగా రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా ఏపీకి రాజధాని ఏదో కూడా నిర్ణయించలేకపోతున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగువారందరికీ మంచి జరగాలంటే కేసీఆర్ లాంటి నాయకత్వం అవసరమని వారు అభిప్రాయపడ్డారు.