సీఎం కళ్ళు మూసుకుంటే రౌడీయిజం అంటే ఏంటో చూపిస్తాం - వైసీపీ నేతల వార్నింగ్
చంద్రబాబుకు దమ్ముంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టాలని సవాల్ చేశారు. తన దెబ్బకు ఇప్పటికీ టెక్కలిలోని కొన్ని గ్రామాల్లో అడుగు పెట్టేందుకు అచ్చెన్నాయుడికి చెమటలు పడుతున్నాయన్నారు.
ఏపీలో రాజకీయ ఉద్రిక్తత రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల అధికార పార్టీ కూడా ప్రతిపక్షంపై గట్టిగానే విరుచుకుపడుతోంది. తనకు కూడా చెప్పు చూపించాలని ఉందంటూ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందించారు.
జగన్‌పై నోరు జారితో నేనే దాడి చేస్తా- ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
జగన్‌మోహన్ రెడ్డిపై ఎవరైనా నోరు జారితే తానే తొలుత అటాక్ చేస్తానని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. తనకు జీవితం మీద, ప్రాణం మీద ఆశ లేదని.. తన జీవితాన్ని ఏనాడో జగన్‌కు అంకితం చేశానని.. ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే దాడి చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు దమ్ముంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టాలని సవాల్ చేశారు. తన దెబ్బకు ఇప్పటికీ టెక్కలిలోని కొన్ని గ్రామాల్లో అడుగు పెట్టేందుకు అచ్చెన్నాయుడికి చెమటలు పడుతున్నాయన్నారు.
సీఎం కళ్లు మూసుకుంటే రౌడీయిజం ఏంటో చూపిస్తాం- మంత్రి జయరాం
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాసేపు కళ్లు మూసుకుంటే రౌడీయిజం అంటే ఎలా ఉంటుందో చంద్రబాబుకు చూపిస్తామని మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. తాము కన్నెర్ర చేస్తే చంద్రబాబుకు రోడ్ల మీద తిరిగే అవకాశమే ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పేరు బ్యాలెట్ పేపర్‌పై ఉండదని, ఆయన ఇక పోటీ చేసే అవకాశం కూడా ఉండదని ఇదే తన శాపమని గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. వైసీపీలోకి వస్తే 2025 తర్వాత చంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవి, కార్పొరేటర్‌గా గెలవలేని లోకేష్‌కు కోఆప్షన్ సభ్యుడి పదవి ఇస్తామని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు మా ప్రాంతానికి వచ్చి మమ్మల్నే బెదిరిస్తున్నారని, ఓకే రాజధానికి ఒప్పుకోవాలని బెదిరిస్తుంటే భయపడిపోవాలా అని మంత్రి జయరాం ప్రశ్నించారు.
టీడీపీలో దద్దమ్మలు, సన్నాసులు..
ఎన్ని శక్తులు ఏకమైనా జగన్‌మోహన్ రెడ్డిని ఓడించలేరని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. జగన్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని, దాన్ని చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన రాబోతోందన్నారు.
టీడీపీలో మొత్తం దద్దమ్మలు, సన్నాసులే ఉన్నారని మంత్రి బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు చలికాలం ముచ్చట్లు మాని.. ప్రజలకు పనికొచ్చే ఆలోచనలు చేయాలని ఎంపీ నందిగం సురేష్ సూచించారు. వైసీపీ కార్యకర్తలు తిరగబడితే చంద్రబాబు కారులోనే దాక్కోవాల్సి వస్తుందన్నారు.