అభాసుపాలైన వైసీపీ సోషల్ మీడియా
వివాదమే లేని చోట వివాదాన్ని సృష్టించి పవన్‌ను ఏదో కంపుచేద్దామని ప్రయత్నించిన వైసీపీ సోషల్ మీడియా విభాగమే విమర్శలపాలవుతోంది. ఇప్పటికైనా సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షిస్తున్న వాళ్ళు బుద్ధితెచ్చుకుని ఇకముందైనా ఇలాంటి వ్యర్ధ ప్రయత్నాలు మానుకుంటే మంచిది.
విమర్శలు, ఆరోపణలు చేయటంలో అన్నీపార్టీలతో పాటు వాటి సోషల్ మీడియా విభాగాలు కూడా రెచ్చిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు, తమ్ముళ్ళు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు జనసేన సోషల్ మీడియా విభాగం రెచ్చిపోతుంటుంది. అలాగే చంద్రబాబు, పవన్ పైన మంత్రులు, వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతుంటుంది. అకేషనల్ గా మాత్రమే జగన్ చంద్రబాబు, పవన్ పై రెచ్చిపోతుంటారు. నిజానికి ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు, విమర్శలు అర్ధవంతమైనది అయితే సంతోషమే. కానీ, ప్రతి పార్టీ ఎదుటిపార్టీలో కేవలం నెగిటివ్ ను మాత్రమే చూస్తుండటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియాలో ఒకపోస్టు విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అదేమిటంటే మంగళగిరి పార్టీ ఆఫీసులో జెండావందనం చేసేటప్పుడు పవన్ చెప్పులు వేసుకున్నాడని.. వైసీపీ సోషల్ మీడియా తప్పుపట్టింది. జెండావందనం చేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదని పవన్ కు అంతమాత్రం తెలీదా అంటు రెచ్చిపోయారు.
నిజానికి జెండావందనం చేసేటప్పుడు చెప్పులు లేదా బూట్లు వేసుకోకూడదని ఎక్కడా లేదు. దశాబ్దాలుగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి నుండి పంచాయతీ సర్పంచ్ వరకు రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండావందనం చేస్తునే ఉన్నారు. ఎప్పుడూ తలెత్తని వివాదం హఠాత్తుగా ఇప్పుడు తలెత్తటానికి వైసీపీ సోషల్ మీడియానే కారణం. అనవసరంగా లేని సమస్యను సృష్టించి పవన్‌ను గబ్బుపట్టిద్దామని ప్రయత్నించటం చాలా తప్పు.
వివాదమే లేని చోట వివాదాన్ని సృష్టించి పవన్‌ను ఏదో కంపుచేద్దామని ప్రయత్నించిన వైసీపీ సోషల్ మీడియా విభాగమే విమర్శలపాలవుతోంది. ఇప్పటికైనా సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షిస్తున్న వాళ్ళు బుద్ధితెచ్చుకుని ఇకముందైనా ఇలాంటి వ్యర్ధ ప్రయత్నాలు మానుకుంటే మంచిది. అన్నీ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న సోషల్ మీడియా విభాగాలు కాస్త విచక్షణ, సంయమనం పాటిస్తే ఇపుడున్నంత నెగిటివ్ వాతావరణముండదు. డైరెక్టుగా నేతలు చేయలేని ఆరోపణలు, విమర్శలను పార్టీలు సోషల్ మీడియా ద్వారానే బురదజల్లించేస్తున్నాయి. కాబట్టి ఇకనుండైనా విమర్శించటం కోసమే విమర్శలని కాకుండా కాస్త విచక్షణ ఉపయోగిస్తే బాగుంటుంది.