బెజవాడలో వీధి కుక్కల స్వైర విహారం.. అలర్ట్ అయిన యంత్రాంగం
బ్లూక్రాస్ సంస్ధ కోర్టులకు వెళ్లే అవకాశముంది కాబట్టి.. యానిమల్ యాక్ట్ కు లోబడి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మేయర్.
హైదరాబాద్ అంబర్ బేటలో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మరణం సంచలనంగా మారింది. ఆ తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. మరణించిన బాలుడి కుటుంబానికి హైదరాబాద్ కార్పొరేషన్ 8 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించింది. ఇలాంటి ఘటన ఇప్పుడు ఏపీలోని బెజవాడలో కలకలం రేపింది. ప్రాణాపాయం తప్పింది కానీ, విజయవాడలోని భవానీ నగర్ లో ముగ్గురు చిన్నారులు కుక్కల దాడిలో గాయపడ్డారు. దీంతో బెజవాడ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
బ్లూ క్రాస్ తో జాగ్రత్త..
విజయవాడలో ఉదయం కుక్కలదాడి జరగడంపై కార్పొరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. నగర మేయర్ భాగ్యలక్ష్మి సమీక్ష నిర్వహించారు. బ్లూక్రాస్ సంస్ధ కోర్టులకు వెళ్లే అవకాశముంది కాబట్టి.. యానిమల్ యాక్ట్ కు లోబడి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మేయర్. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నామని, వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కలకు కూడా వ్యాక్సిన్ లు వేయించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవానిపురం ఘటన చాలా బాధాకరం అని అన్నారు మేయర్ భాగ్యలక్ష్మి.
కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో బెజవాడ మేయర్ కాస్త ముందు జాగ్రత్త తీసుకున్నట్టున్నారు. కుటుంబ నియంత్రణ వ్యవహారం గురించే మాట్లాడారు. మరోవైపు బ్లూ క్రాస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొత్తమ్మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది. గతంలో కూడా కుక్కల దాడులు జరిగినా, నాలుగేళ్ల చిన్నారి ఏకంగా ప్రాణాలు కోల్పోవడం ఈ దఫా సంచలనం అయింది. జంతువుల హక్కుల గురించి మాట్లాడే జంతు ప్రేమికులు కాస్త మనుషుల సంగతి కూడా పట్టించుకోండి అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.