టీడీపీకి వ్యూహకర్త సాయం, తొలిసారి పార్టీ వేదికపైకి
వ్యూహకర్త రాబిన్ శర్మ ఇదేం ఖర్మ కార్యక్రమం గురించి టీడీపీ నేతలకు వివరణ ఇచ్చారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ప్రచారం చేసుకోవాలి అనే విషయాలను చెప్పారు.
తన వ్యూహాలతోనే ఏపీ అభివృద్ధి చెందిందని చెప్పుకుంటుంటారు చంద్రబాబు, విజన్ 2020, విజన్ 2040 అని ఏవేవో డెడ్ లైన్లు పెట్టుకుని ప్రచారం చేసుకునేవారు. అలాంటి వ్యూహకర్తకే ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త అవసరం వచ్చింది. అవును, టీడీపీ చరిత్రలో తొలిసారిగా ఓ వ్యూహకర్తను నియమించుకుంది. అతనిపేరు రాబిన్ శర్మ. ఇన్నాళ్లూ ప్రచారంలో ఉన్న ఈ పేరు ఇప్పుడు తొలిసారిగా తెరపైకి వచ్చింది. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో రాబిన్ శర్మ వేదికపైకి వచ్చారు. ఆయన రూపొందించిన కొత్త కార్యక్రమం గురించి వివరించారు.
ఇదేం ఖర్మ ఆయనదే..
గతంలో బాదుడే బాదుడు కార్యక్రమం కూడా రాబిన్ శర్మ సలహాయే అని రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పుడు ఆయనే ఇదేం ఖర్మ కార్యక్రమం డిజైన్ చేశారు. కర్నూలులో ఈ కార్యక్రమం గురించి హింట్ ఇచ్చిన చంద్రబాబు, విస్తృత స్థాయి సమావేశంలో దీని గురించి పూర్తిగా వివరించారు. వ్యూహకర్త రాబిన్ శర్మ ఈ కార్యక్రమం గురించి ఇంగ్లిష్ లో టీడీపీ నేతలకు వివరణ ఇచ్చారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ప్రచారం చేసుకోవాలి అనే విషయాలను చెప్పారు.
జగన్ కి గురువు, చంద్రబాబుకి శిష్యుడు..
2019 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్, ప్రశాంత్ కిషోర్ టీమ్ ని రంగంలోకి దింపారు. ఆయన వ్యూహాలతోనే జగన్ ప్రచారం ముమ్మరం చేశారు, చివరకు విజయం సాధించారు. ఇప్పుడు చంద్రబాబు నియమించుకున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శిష్యుడు కావడం విశేషం. కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ టీమ్ నుంచి విడిపోయిన రాబిన్ శర్మ, సొంతగా ఓ సంస్థ స్థాపించారు. రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా టీడీపీతో ఒప్పందం కుదుర్చుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో మునిగిపోగా, ఆయన శిష్య పరమాణువులు విడివిడిగా సంస్థలు స్థాపించి వ్యూహకర్తలవుతున్నారు. మరి ఆయన శిష్యుడు రాబిన్ శర్మ వ్యూహం ఏపీలో టీడీపీకి ఏమేరకు లాభిస్తుందో చూడాలి.