జోగి రమేష్ ఇంటిపై రాళ్లు.. చేష్టలుడిగి చూసిన పోలీసులు
అడ్డుకునే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ పై అల్లరి మూకలు తిరగబడ్డాయి. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు వేసి అల్లరి మూక అక్కడినుంచి వెళ్లిపోయింది.
వైసీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, ఇప్పుడు నేతల ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస ఇంకా చల్లారలేదు. సీఎం చంద్రబాబు సహా ఇతర నాయకులు శాంతి మంత్రం పఠిస్తున్నా.. వారి మాటల్ని లెక్కచేయకుండా టీడీపీ కార్యకర్తలు, చోటా మోటా నాయకులు ప్రతీకార దాడులకు తెగబడుతున్నారు. ఆ విషయం తెలిసినా అగ్రనాయకులు వారించే ప్రయత్నం చేయకపోవడం విశేషం. వారు శాంతి శాంతి అంటూనే ఉన్నారు. వీరు రాళ్లు, కర్రలతో వెంట పడుతూనే ఉన్నారు.
మాజీమంత్రి జోగిరమేష్ ఇంటిపై తాజాగా రాళ్లదాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు కొందరు జోగి రమేష్ ఇంటి వద్దకు కారులో వచ్చారు. వస్తూ వస్తూ కారులో గులకరాళ్లు తెచ్చుకున్నారు. జోగి రమేష్ ఇంటి ముందు దర్జాగా కారు ఆపి అందులోనుంచి రాళ్లు తీసుకుని విసిరారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా వైసీపీ ఆరోపిస్తోంది. కారు నెంబర్ తో సహా వీడియో సాక్ష్యాన్ని సోషల్ మీడియాలో వైసీపీ అప్ లోడ్ చేసింది.
మాజీమంత్రి జోగిరమేష్ ఇంటి పై టీడీపీ, జనసేన గుండాలు దాడి
— YSR Congress Party (@YSRCParty) June 16, 2024
ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటి పై రాళ్లు రువ్విన టీడీపీ , జనసేన అల్లరిమూకలు
AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు
జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరిన… pic.twitter.com/3aFVHqlAbX
దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పటిష్ట బందోబస్తు పెట్టాలనే డిమాండ్లు వినపడుతున్నా.. పోలీస్ అధికారులు మాత్రం ఒకరిద్దరు కానిస్టేబుళ్లను సెక్యూరిటీగా పెట్టి మమ అనిపిస్తున్నారు. జోగి రమేష్ ఇంటి వద్ద కూడా ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. అల్లరి మూకల్ని వారించడం ఆయన వల్ల కాలేదు. అడ్డుకునే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ పై వారు తిరగబడ్డారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు వేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.